Trisha | నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదానికి సంబంధించి తంజావూరు పోలీస్స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉదయనిధిపై తీవ్రమైన ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన హుటాహుటిన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇక ఈ పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు, మధ్యాహ్నం వరకు ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది.
అసలు వివాదం ఏమిటంటే..
కావేరి జలాల సాధన నిరసన సభలో సీఎం విజయ్ను లక్ష్యంగా చేసుకుని ఉదయనిధి మాట్లాడుతున్న సమయంలో సభలోని డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా “త్రిష.. త్రిష” అంటూ గట్టిగా అరిచారు. అయితే కార్యకర్తల తీరును వారించాల్సిన ఉదయనిధి, నవ్వుతూ ద్వంద్వార్థలు వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం నీళ్లు రావాలంటూ ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదం కాగా, ఆ తర్వాత తాను కావేరి జలాల గురించే మాట్లాడానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.