న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ మురికివాడకు చెందిన మొహ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్(YouTube Channel)ను మళ్లీ పునరుద్దరించారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టిన సమయంలో అతను తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ సమయంలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘన కింద అతని యూట్యూబ్ ఛానల్‌ను టర్మినేట్ చేశారు. దీనిపై ఆన్లైన్లో చర్చ జరిగింది. ప్రభుత్వంపై విమర్శలు రావడంతో.. మళ్లీ ఆ ఛానల్‌ను పునర్ ప్రారంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం తన ఛానల్ అందరికీ అందుబాటులోకి వచ్చేసినట్లు ఇర్ఫాన్ కన్ఫర్మ్ చేశాడు.
ఢిల్లీలోని మురికివాడలో ఉంటున్న ఇర్ఫాన్‌ను ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కలిశారు. ఇర్ఫాన్ తన ఛానల్లో ప్రజెంట్ చేసిన ఇంటర్వ్యూలు, వీడియోలకు విశేష స్పందన వచ్చింది. సీజేపీ ఆందోళన సమయంలో రాజ్యాంగంలోని పీఠికను ఇర్ఫాన్ కంఠస్థం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆన్లైన్లో ఆ వీడియో విస్తృతంగా యూజర్లను ఆకర్షించింది. ఆర్గనైడ్జ్ రంగంలో కార్మికుల సమస్యల గురించి అతను అనర్గళంగా మాట్లాడాడు. ప్రజాస్వామ్య హక్కులు, ఆరోగ్యం, విద్య గురించి కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. అతని ఛానల్‌కు ఒక్క రోజులోనే వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చేశారు. దీంతో అతను ఫేమస్ అయ్యాడు.