CMVijay | తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తంజావూరులో జరిగిన కావేరి జలాల సాధన నిరసన సభలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ కావేరి నదీ జలాల సమస్యపై స్పందించడం లేదని, నోరు మెదపడం లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. అయితే, ఉదయనిధి మాట్లాడుతున్న సమయంలో సభలోని డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా “త్రిష.. త్రిష” అంటూ గట్టిగా అరిచారు. కార్యకర్తల తీరును వారించాల్సిన ఉదయనిధి, నవ్వుతూ ద్వంద్వార్థలు వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం నీళ్లు రావాలంటూ ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదం కాగా, ఆ తర్వాత తాను కావేరి జలాల గురించే మాట్లాడానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఇక రాజకీయ వేదికలపై ప్రత్యర్థి పార్టీలను విమర్శించే క్రమంలో ఒక మహిళా నటి పేరును లాగడం, పైగా బహిరంగంగా అసభ్యకరమైన, చౌకబారు డబుల్ మీనింగ్ కామెంట్లు చేయడంపై తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవాన్ని దిగజార్చేలా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రవర్తించిన ఉదయనిధి స్టాలిన్‌పై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీవీకే జాతీయ మహిళా కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ ఘటనపై బీజేపీతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం తీవ్రంగా మండిపడుతూ ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.