Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్, LIG గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. లక్కీ డ్రా ద్వారా మొత్తం 7,340 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, ఇప్పటివరకు 6,643 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, వారిలో 5,521 మంది అర్హులుగా నిర్ధారించబడ్డారని వెల్లడించారు.
మిగిలిన అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని గౌతమ్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా నిర్ధారించబడిన లబ్ధిదారులకు అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని చెప్పారు.
లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులు తమకు ఇల్లు కేటాయించబడుతుందా లేదా అనే ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
గృహాల కేటాయింపు ప్రక్రియను ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు లబ్ధిదారులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గౌతమ్ తెలిపారు. ఇల్లు మంజూరు చేయిస్తామని, అధికారులతో మాట్లాడి సహాయం చేస్తామని చెబుతూ అమాయక లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
గృహాల కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లు, మధ్యవర్తులు లేదా ఇతర వ్యక్తులకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ లేదా ఇతర రూపంలో డబ్బులు చెల్లించవద్దని సూచించారు. గృహాల కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత అర్హతలు, అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుందని తెలిపారు.
గృహానికి సంబంధించిన మొదటి విడత మొత్తాన్ని చెల్లించాల్సిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లించాల్సిన మొత్తం, గడువు, ఇతర సూచనలను కేటాయింపు పత్రంతోపాటే అధికారికంగా తెలియజేస్తామని గౌతమ్ చెప్పారు. కేటాయింపు పత్రంలో పేర్కొన్న అధికారిక బ్యాంకు ఖాతాకు మాత్రమే నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని సూచించారు.
ఇతర వ్యక్తులు తెలిపే ఖాతాలకు లేదా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ చేయవద్దని హెచ్చరించారు. ఇల్లు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినా, అనధికారిక ఖాతాలకు చెల్లించాలని కోరినా వెంటనే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గృహాల కేటాయింపు, క్షేత్రస్థాయి పరిశీలన, కేటాయింపు పత్రాలు, మొదటి విడత చెల్లింపు తదితర అధికారిక సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov.in ను సందర్శించాలని సూచించారు. అలాగే 040-24603572 కాల్ సెంటర్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారికంగా జారీ చేసే ప్రకటనలు, కేటాయింపు పత్రాలు, సంబంధిత అధికారుల సూచనలను మాత్రమే విశ్వసించాలని వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.