– ఈఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 30 : పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ చేశారు. రూరల్ మండలం ఎం వెంకటయ్య పాలెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది కార్మికులకు బిపి, షుగర్, పలురకాల రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. తొలుత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల ఆరోగ్య భద్రతకు పలు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీ ఆవిర్భావం అనంతరం పలు దఫాదుగా ఈఎంసి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశామన్నారు.

‘పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట’
తెల్లవారుజాము నుండి అనేక పారిశుధ్య పనులలో నిమగ్నమవుతున్న కార్మికులు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రోజువారి పనులలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి అవసరమైన పరికరాలను, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచామన్నారు. కార్మికులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే వార్డులు పచ్చదనం పరిశుభ్రంతో ఉంటాయని గుర్తు చేశారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకుగాను కార్యాచరణ ఏర్పాటు చేయడంతో పాటు, విడతలవారీగా వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

‘పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట’