చౌటుప్పల్, సెప్టెంబర్ 30 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్ రోడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి శ్రీరాముడు, పరమశివుడిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి నాయకులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం ప్రతిరూపాన్ని గుమ్మడికాయపై ఏర్పాటు చేసి పగలగొట్టడంతో పాటు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. శ్రీరాముడిని ధనికులకు, శివుడిని పేదలకు ప్రతీకగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. శ్రీరాముడు, పరమశివుడు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవాలని, వారిని రాజకీయాలకు ముడిపెట్టి విభజనకు దారితీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలన్నారు. అన్ని మతాల విశ్వాసాలను, దేవతలను సమానంగా గౌరవించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షం గౌడ్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన, ఐలయ్య యాదవ్, మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్, సీనియర్ నాయకులు రమణగోని శంకరయ్య, చినుకుని మల్లేశం, బుడ్డ సురేష్, పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, తంగళ్ల వెంకటేశం, నందగిరి వెంకటేశం గౌడ్, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, బత్తుల జంగయ్య గౌడ్, కాయతి రమేష్ గౌడ్ పాల్గొన్నారు.