బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉందో సాక్షాత్తు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మాటలే చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి నెట్వర్క్ నెలకొందనే విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో ఉన్నతాధికారులే అవినీతికి పాల్పడుతున్నారంటూ వాపోయారు. ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో బదిలీ ఏజెంట్ల ముప్పు పెరిగిపోయిందని, రాష్ట్రంలో ‘ట్రాన్స్ఫర్ రాజ్’ వ్యవస్థ విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బదిలీలపై అధికారులు సైతం లంచాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. ఉద్యోగులెవ్వరూ పోస్టింగ్‌ల కోసం ఈ మధ్యవర్తులను కలవకూడదని హెచ్చరించారు. ‘ఉద్యోగ బదిలీలను కౌన్సెలింగ్ విధానంలోనే చేపడతాం. ఎవ్వరూ పైరవీలు చేయద్దని కోరుతున్నా. రాజకీయ నేతకు సన్నిహితంగా ఉండేవాళ్లు అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లను సంప్రదిస్తే..ఇటు ఏజెంట్స్‌కు, అటు అధికారులకు లంచాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పని చేయవద్దు’ అని అన్నారు.