హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : గాంధీ సరోవర్ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వీడియో రిలీజ్ చేశారు. మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు బఫర్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి అపార్ట్మెంట్ నిర్మాణం చేశారని, అందుకే దాన్ని తొలగించి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు.
2012లో ఉన్న జీవో ప్రకారం 30 మీటర్ల బఫర్ జోన్ వదిలి అపార్ట్మెంట్ కట్టాల్సి ఉన్నప్పటికీ.. మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి నాలాపై నిర్మాణం చేశారని చెప్పారు. బిల్డర్లు చేసిన తప్పునకు ప్రభుత్వాన్ని నిందించాలని చూస్తున్నారని వాపోయారు. అధికారులు, బిల్డర్లు చేసిన తప్పులకు ఆ అపార్ట్‌మెంట్‌వాసులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అపార్ట్‌మెంట్‌వాసులకు నష్టపరిహారం ఇస్తుందని, బిల్డర్లపై కచ్చితంగా కేసులు పెట్టి, వారిచేతనే అపార్ట్‌మెంట్‌వాసులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.