Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 1: గోదావరిఖని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రాలలో ఒకటి కళ్యాణ్ నగర్, మేదరిబస్తీ, ఉల్లి గడ్డల బజార్ హోల్ సేల్, రిటైల్ దుకాణాలకు నిలయంగా ఉంది. ఇక్కడ నుంచే రామగుండం పారిశ్రామిక ప్రాంతంతోపాటు చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలకు నిత్యవసర సరుకుల రవాణా జరుగుతోంది. ఈ వ్యాపార కేంద్రాలలో ప్రతీ నెల రూ.కోట్లలో వ్యాపారాలు సాగుతున్నాయి.
అసలే పండుగ పూట.. సందిట్లో సడేమియాగా కొంతమంది వ్యాపారులు హైదరాబాద్ బేగం బజార్, మహారాష్ట్ర నుంచి నాణ్యత లేని సరుకులను పెద్ద మొత్తంలోనే దిగుమతి చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వీటిని నియంత్రించాల్సిన అధికారులు ఈ హోల్సేల్ దుకాణాలను తనిఖీలు చేసిన సందర్భాలే లేవు. ‘ఇదంతా షరా ‘మామూలే’ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పిండి పదార్థాలు మహారాష్ట్ర నుంచి, ఆయిల్, ఇతర నిత్యవసర సరుకులు హైదరాబాద్ నుంచి జీరో బిల్లులతో దిగుమతి చేసుకుంటారని సమాచారం. అధికారులు కూడా గుర్తు పట్టలేని విధంగా క్వాలిటీ సరుకులను పోలిన విధంగానే ఉండటంతో మోసపోవడం ప్రజలకు శాపంగా పరిణమిస్తుంది.
ఆ దుకాణాలల్లో తనిఖీలు చేస్తే..!
గోదావరిఖనిలోని ఆ హోల్సేల్ దుకాణాల్లో ప్రతీ ఏటా రూ.కోట్ల వ్యాపారాలు సాగుతుంటాయి. ఇక పండుగ సమయాల్లో గోదావరిఖని లోని వివిధ ఏరియాల్లో ఉన్న కిరణం దుకాణాల వ్యాపారుల తో పాటు మంథని, రామగుండం, అంతర్గాం తదితర మండలాల్లోని చుట్టు పక్కల గ్రామాల్లో గల కిరాణం దుకాణాలకు ఇక్కడ నుంచే పెద్ద మొత్తంలో ఇతర వ్యాపారులు నిత్యవసర సరుకులు తీసుకవెళ్తుంటారు. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో వ్యాపారులు హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో సరుకులు ముందుగానే దిగుమతి చేసుకుంటున్నారు.
వీరిలో కొంతమంది హైదరాబాద్ బేగం బజార్లో లోని ఓ కుటీర పరిశ్రమలో తయారైన కల్తీ సరుకులకు లేబుళ్లు అంటించి ఎవరూ గుర్తు పట్టని విధంగా జీరో బిల్లులతో తీసుకవస్తున్నారని సమాచారం. అలాగే పిండి పదార్థాలను మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ దుకాణాల్లో లభించే వస్తువుల్లో దాదాపు 60 శాతం నాణ్యత లేనివిగా ప్రచారం జరుగుతుంది. గతంలో అధికారులు తనిఖీలు చేయగా పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. కాలం చెల్లిన వస్తువులను సైతం విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో పండుగ పూట నాణ్యత సరుకులను విక్రయించే అవకాశం కూడా లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా కళ్యాణ్ నగర్ లో తనిఖీలు జరిపితే కల్తీ దందా బయటపడే అవకాశం ఉంది. రామగుండం నగర పాలక సంస్థ హెల్త్ విభాగం అధికారులైనా తనిఖీలు చేసి తగు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.