కారేపల్లి, అక్టోబర్ 01 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం ఉసిరికాయలపల్లిలో గురువారం నుండి ప్రారంభమయ్యే కోట మైసమ్మ జాతర సందర్భంగా వివిధ మార్గాల్లో వాహన రాకపోకలకు దారి మళ్లింపు చేయడం జరిగిందని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ విలేకరులతో మాట్లాడుతూ.. ఖమ్మం నుండి ఇల్లెందు వెళ్లే సాధారణ ప్రయాణికుల వాహనాలు రఘునాధపాలెం, కామేపల్లి, కారేపల్లి క్రాస్ రోడ్, గాంధీనగర్, సీతారాంపురం, లలితాపురం మీదుగా వెళ్లాలని సూచించారు. అదే విధంగా ఇల్లెందు నుండి ఖమ్మం వెళ్లే వాహనదారులు లలితాపురం, సీతారాంపురం, గాంధీనగర్, కారేపల్లి, కామేపల్లి క్రాస్ రోడ్, కొత్త లింగాల, ముచ్చెర్ల, పండితాపురం, మంచుకొండ, రఘునాధపాలెం మీదుగా వెళ్లాలన్నారు.
కారేపల్లి మీదుగా జాతరకు వచ్చే వాహనదారులు పోలంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ పార్కింగ్‌లో తమ వాహనాలు నిలపాలన్నారు. గాదేపాడు, గాంధీనగర్, సీతారాంపురం నుండి వచ్చే వాహనాలు లలితాపురం, నడిమూరు మీదుగా పోలంపల్లి పార్కింగ్ స్థలానికి చేరుకోవాలన్నారు. ఆటోలకు పోలంపల్లి క్రాస్ రోడ్ వద్ద, ద్విచక్ర వాహనాలకు స్వాగత ముఖ ద్వారం (ఆర్చ్) వద్ద పార్కింగ్ స్థలం కేటాయించినట్లు చెప్పారు. లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, కార్లు, ఇతర వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేస్తే జరిమానాలు విధించనున్నట్లు ఆయన హెచ్చరించారు. వాహనదారులు పోలీసులకు సహకరించి కోరారు.
Karepally : కోటమైసమ్మ జాతర నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపు