Vishal Brahma | బాలీవుడ్ నటుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ఫేమ్ విశాల్ బ్రహ్మ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయ్యారు. సుమారు రూ.40 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక నైజీరియాకు చెందిన అంతర్జాతీయ ముఠా హస్తం ఉన్నట్లు DRI అధికారులు గుర్తించారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ సినీ అవకాశాలు లేకపోవడం తీవ్రమైన ఆర్థిక సమస్యల కారణంగానే ఈ నేరంలో భాగస్వామి అయినట్లు సమాచారం.
డబ్బు అవసరం ఉండటంతో, స్నేహితుల ద్వారా ఆయనకు ఈ నైజీరియా ముఠాతో పరిచయమైందని దర్యాప్తులో తేలింది. అన్ని ఖర్చులూ తామే భరించి కాంబోడియా ట్రిప్‌కు వెళ్లాల్సిందిగా ముఠా సభ్యులు బ్రహ్మను కోరారు. తిరిగి భారత్‌కు వచ్చేటప్పుడు మాదకద్రవ్యాలను చేరవేస్తే భారీగా నగదు ఇస్తామని వారు ఆశ చూపారు. ముఠా చెప్పిన ప్రకారం విశాల్ బ్రహ్మ రెండు వారాల క్రితం ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లారు. అక్కడ ఓ నైజీరియన్ అతడికి డ్రగ్స్ నింపిన ట్రాలీ బ్యాగ్‌ను అప్పగించినట్లు తెలిసింది. నైజీరియా గ్యాంగ్ సూచనల మేరకు, బ్రహ్మ సింగపూర్ మీదుగా కాంబోడియా నుంచి చెన్నైకి విమానంలో చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా ఢిల్లీకి చేరుకోవాలని అతడి ప్లాన్‌గా సమాచారం. అయితే, పక్కా సమాచారంతో అప్రమత్తమైన DRI అధికారులు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విశాల్ బ్రహ్మను పట్టుకొని ఆయన బ్యాగ్‌లో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై DRI అధికారులు ముఠాలోని ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నారు.