Papaya Seeds | బొప్పాయి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. చాలా మంది ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బొప్పాయి పండ్లే కాదు, వాటిల్లో ఉండే విత్తనాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది ఈ పండ్లను తిన్న తరువాత వాటిల్లో ఉండే విత్తనాలు పడేస్తారు. కానీ పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం బొప్పాయి పండ్లలోని విత్తనాలను కూడా మనం తినవచ్చు. ఇవి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. కనుక ఈ విత్తనాలను తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయి పండ్లలోని విత్తనాలు మనకు అనేక లాభాలను అందిస్తాయి. ఈ విత్తనాలను రోజుకు మనం పావు టీస్పూన్ మోతాదులో నేరుగా అలాగే తినవచ్చు. ఇలా తినలేమని అనుకునేవారు ఈ విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి తినవచ్చు. ఆ పొడిని మనం రోజూ తినే ఆహారాలపై చల్లి కూడా తినవచ్చు. ఇలా తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి.
బొప్పాయి పండ్లలో మాదిరిగానే వాటి విత్తనాల్లోనూ పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లను సరిగ్గా జీర్ణం చేస్తుంది. దీంతో కండరాలకు శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. అతిగా భోజనం చేసినప్పుడు కూడా ఈ విత్తనాలను తింటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. అజీర్తి సమస్య తలెత్తదు. ఈ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యర్థాలను సులభంగా బయటకు పంపిస్తుంది.
ఈ విత్తనాల్లో యాంటీ పారాసైటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కనుక ఈ విత్తనాలను తింటుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే పురుగులు నశిస్తాయి. పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. పొట్టలో పురుగులు ఉన్నవారు ఈ విత్తనాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. బొప్పాయి విత్తనాలను తినడం వల్ల కిడ్నీలు, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా భాగాల్లోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోయి అవి శుభ్రంగా మారుతాయి. ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డీటాక్సిఫయింగ్ గుణాలను సైతం కలిగి ఉంటాయి. కనుక కిడ్నీలు, లివర్ శుభ్రంగా మారుతాయి. కిడ్నీలపై పడే ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావం తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విత్తనాల్లో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.
బొప్పాయి విత్తనాలు ఘాటైన, చేదైన రుచిని కలిగి ఉంటాయి. ఆవాల రుచిలా అనిపిస్తాయి. అయితే ఈ విత్తనాలను తినడం ప్రారంభిస్తే వీటిని ముందుగా తక్కువ మోతాదులో తినాలి. తరువాత మోతాదును పెంచవచ్చు. ముందుగా 3 లేదా 5 విత్తనాలను లేదా పావు టీస్పూన్ విత్తనాలను నేరుగా తినవచ్చు. నేరుగా తినలేకపోతే ఈ విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని అరటీస్పూన్ మోతాదులో తినవచ్చు. దీన్ని మీరు తీసుకునే స్మూతీలు, పెరుగు, తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఈ విత్తనాల పొడి ఘాటుగా ఉంటుంది కనుక కారం, మిరియాలకు ప్రత్యామ్నాయంగా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సలాడ్స్, సూప్‌లు, వేపుళ్లు వంటి వాటిపై ఈ విత్తనాల పొడిని చల్లి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. బొప్పాయ విత్తనాలను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తినకూడదు. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడే వారు కూడా ఈ విత్తనాలను తినకూడదు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ బొప్పాయి విత్తనాలను తింటుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.