PM Modi | బీహార్ ఎన్నికలు కులతత్వ విషాన్ని తిరస్కరించాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ సూరత్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూనే.. గుజరాత్లో నివసిస్తున్న బీహార్ ప్రజలను ఆయన పలకరించారు. ప్రధాని మాట్లాడుతూ.. బీహార్ ప్రజలను కలవకుండా సూరత్‌ను వదిలి వెళ్తే.. ప్రయాణం వృథా అయినట్లుగా అనిపిస్తుందన్న ఆయన.. గుజరాత్లో ముఖ్యంగా సూరత్‌లో నివసిస్తున్న బీహారీ సోదరుల మధ్యకు వచ్చి ఈ విజయోత్సవంలో భాగం కావడం తన బాధ్యత అన్నారు. బీహార్ ప్రజలకు రాజకీయాలు నేర్పించాల్సిన అవసరం లేదని, వారు ప్రపంచానికి రాజకీయాలు నేర్పిస్తారన్నారు.
బీహార్ కుల ఆధారిత రాజకీయాలను తిరస్కరించిందన్న ఆయన.. బీహార్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా బీహార్ ప్రతిభను చూస్తారన్నారు. మా ప్రాథమిక ఆలోచన దేశం ముందు అని.. గత రెండు సంవత్సరాలుగా ఈ బెయిలబుల్ నాయకులు బీహార్‌కు వెళ్లి కులతత్వాన్ని ప్రకటిస్తున్నారని విమర్శించారు. తమ శక్తినంతా ఉపయోగించి కులతత్వ విషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని.. కానీ ఈ బీహార్ ఎన్నికలు ఈ కులతత్వ విషాన్ని పూర్తిగా తిరస్కరించారన్నారు. ఈ ఎన్నికల్లో, విజయవంతమైన ఎన్డీఏ కూటమికి, ఓడిపోయిన మహా కూటమికి మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందని.. ఇది ముఖ్యమైన విజయమన్నారు. దీని అర్థం సాధారణ ఓటర్లు ఏకగ్రీవంగా ఓటు వేశారని.. ఇది బీహార్ అభివృద్ధి పట్ల ఉన్న మక్కువను ప్రతిబింబిస్తుందన్నారు. ఎన్నికల్లో యువత, మహిళలు ప్రతిపక్ష పార్టీలకు సరైన ఇచ్చారని.. బీహార్ ప్రజలు అభివృద్ధి ఎజెండాను ఆమోదిస్తూ ప్రతిపక్షాన్ని పూర్తిగా తిరస్కరించారని.. సూరత్‌లో పనిచేస్తున్న బీహార్ ప్రజలకు ఇక్కడ పూర్తి హక్కులు ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా మోదీ వక్ఫ్ చట్టాన్ని ప్రస్తావించారు. ఇళ్లను అక్రమంగా ఆక్రమించి వక్ఫ్ ఆస్తులుగా మార్చారని.. తమిళనాడులో మొత్తం గ్రామాలను వక్ఫ్ ఆస్తులుగా మార్చారని ఆరోపించారు. అందుకే పార్లమెంటులో వక్ఫ్ చట్టాన్ని ప్రవేశపెట్టామన్నారు. బీహార్ ఎన్నికల సమయంలో ఈ హామీదారులు, వారి మిత్రులు (ప్రతిపక్షాలు) వక్ఫ్ చట్టాన్ని బహిరంగంగా చించివేశారని.. వారు అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయడానికి అనుమతి ఇవ్వమని చెప్పారని.. బీహార్ ప్రజలు కూడా ఈ మత రాజకీయాలను ఓడించారని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎవరూ రక్షించలేరన్న ప్రధాని.. ఈ దేశం ముస్లిం లీగ్-మావోయిస్ట్ కాంగ్రెస్‌ను తిరస్కరించిందన్నారు. కాంగ్రెస్ చర్యలతో దేశం అంసంతృప్తిగా ఉందని.. ఇకపై కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరన్నారు.