కాచిగూడ : భారత రాజ్యాంగాన్ని (Constitution ) 130 సార్లు సవరణ చేశారని, 56 శాతం జనాభా ఉన్న బీసీల కోసం మరోసారి సవరించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah ) డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ సత్యం అధ్యక్షతన శనివారం కాచిగూడలోని హోటల్లో బీసీ,కుల,ఉద్యోగ,విద్యార్థి సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ( BC Reservations ) కోసం సీఎం రేవంత్‌రెడ్డి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లి నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. దేశంలో తెలంగాణ ఉద్యమం తరువాత బీసీ ఉద్యమమే ఉవ్వేత్తున ఎగిసిందని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేసి, బీసీ రిజర్వేషన్ల బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే అమోదించి,తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టికల్ 243 డీ6 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికి సీఎం బీసీ రిజర్వేషన్లపై కోర్టుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని, పార్టీ పరంగా వద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీలం వెంకటేశ్, లాల్‌కృష్ణ, రాజ్‌కుమార్, అనంతయ్య, రాందేవ్మోడీ, పి.సతీశ్, బాలయ్య ముదిరాజ్, అజయ్, భీంరాజ్, శివయాదవ్, ప్రీతం,సూర్యనారాయణ, అంజనేయులు, శ్రీనివాస్‌యాదవ్, రజని,శోభ,ప్రణిత, సాయి, మహేందర్,కుల్ధిప్సింగ్,అఖిల్, అక్ష్మణ్, శరత్‌కుమార్,రమాకాంత్,తదితరులు పాల్గొన్నారు.