Minister Ponnam Prabhakar | చిగురుమామిడి, ఏప్రిల్ 29 : భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేస్తామని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం భూ భారతి నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని తెలిపారు. జూన్ 2 నుండి ఈ చట్టం ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ చట్టం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తామని తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులన్నీ ప్రతీ సంవత్సరం డిసెంబర్ 31న రికార్డు చేయడం జరుగుతుందని వెల్లడించారు.
భూముల హక్కులను కాపాడేందుకు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. తెలంగాణలో రైతులకు చెందిన ప్రతీ భూ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, తిరిగి ఆ భూములను ప్రజా అవసరాలకు వినియోగిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, దఫదఫాలుగా పేదలందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి అవసరాలు పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు. సహకార పరపతి సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తూ రైతు సమస్యలను పరిష్కరించాలని ఆకాంక్షించారు.
అధికారుల బాధ్యత, జవాబుదారితనం పెరిగింది..
అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా అధికారాల వికేంద్రీకరణ జరిగిందని, అధికారుల బాధ్యత, జవాబుదారితనం పెరిగిందని తెలిపారు. గ్రామ పరిపాలన అధికారుల వ్యవస్థ బలోపేతం కానుందని అన్నారు. సాదా బైనామాతో సాగు చేసుకుంటున్న వారికి భూభారతిలో న్యాయం జరగనుందని తెలిపారు. భూభారతి ద్వారా స్పష్టమైన నియమాలను ప్రభుత్వం రూపొందించిందని, భూ వివాదాల పరిష్కారానికి ఈ చట్టంలో అన్ని వివరాలు పొందుపరిచారని తెలిపారు. అనువంశికంగా వచ్చే భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విచారించి వివాదాలకు తావు లేకుండా వారసత్వం హక్కు కల్పిస్తారని తెలిపారు.
రెండచెల అప్పీలు వ్యవస్థ ఉండడం వల్ల రైతుకు న్యాయం జరగకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయించవచ్చని తెలిపారు. కోర్టులకు వెళ్లవలసిన అవసరం ఉండదని అన్నారు. ఆరు నెలల కింద ప్రభుత్వం తహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు ఇవ్వడం ద్వారా జిల్లాలోని 9 వేలకుపైగా భూ సమస్యల దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, ఆర్టీవోలు మహేశ్వర్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో మధుసూదన్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి,, మండల వ్యవసాయ అధికారి, రాజులనాయుడు, మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్, కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు పోలు స్వప్న, డిప్యూటీ తహసీల్దార్ స్వరూప రాణి, ఆర్ఐ అరుణ్ కుమార్, ఏఈవోలు అంజలి, అఖల, ఫరీదీ, సాయికుమార్, ప్రణయ్, సతీష్,, అనిత, శ్వేత, విజయ,అనిల్,ప్రశాంత్ రెడ్డి, ప్రవీణ్ వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి