తిమ్మాజిపేట, ఏప్రిల్ 29 : వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో అధికార కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పిలుపుతో సభకు జనం నీరాజనం పట్టారన్నారు. లక్షలాది మంది జనం సభకు తరలివచ్చి, కాంగ్రెగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను చాటారన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన, కృత్రిమంగా ట్రాఫిక్ జామ్ లతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించినా జనం వాటి దాటి సభకు తరలివచ్చారన్నారు.
ఈ సభతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ఉన్న అభిమానాన్ని ప్రజలు చాటారన్నారు. కాంగ్రెస్ నాయకులు సభ ఫెయిల్ అయిందంటూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఈ సభతో కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని, దీన్ని కప్పిపుచ్చడానికి మంత్రులు నాయకులు, తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రభుత్వము ఒకసారి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం గా ఉన్నారన్నారు.
అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సభకు వచ్చిన వారికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ హుస్సేనీ, స్వామి, మల్లయ్య, మోహనా చారి, అయూబ్ ఖాన్, రఫిక్, వెంకటేష్, సలావుద్దీన్, ఇబ్రహీం, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.