Karimnagar Collectorate | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 28 : అయ్యా… అధికారులేరి ? పదకొండు దాటినా ఇయ్యాల ఇంకా తలుపుతీయలే. ఒక్క సారు కూడా ఇటుదిక్కు వత్తలేడు. నడి ఎండల గింత దూరమచ్చిన, కాయితమియ్యకుంట ఎట్ల పోవాలే. మల్లెప్పుడు రావాలే అంటూ ఓ వృద్ధురాలు కలెక్టరేట్‌లోకి వచ్చే వారిని పోయే వారిని దీనంగా అడుగుతుండగా.. ఇందిరమ్మ ఇల్లు పథకం అధికారి ప్రజావాణిల కలుస్తడు అంటే వచ్చిన. అదెక్కడ జరుగుతుంది. అంటూ తన కుమారుడితో కలిసి వచ్చిన మరో మహిళ కలెక్టరేట్ ఎదుట ఆరా తీస్తున్నది.
ఇలా వీరిద్దరే కాదు.. సోమవారం ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య వంద మందికిపైగా వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చారు. అధికారులెవరూ కానరాక, తమవెంట తెచ్చుకున్న అర్జీలు ఎవరికి అప్పగించాలంటూ కనిపించిన ప్రతివారిని అడుగుతూ, అధికారుల వద్దకు తీసుకెళ్లండంటూ వేడుకుంటుండగా, తమకు తెలియదంటూ దాటవేయడం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట కనిపించిన దృశ్యాలు.
అయితే, కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించే క్రమంలో జిల్లాలోని పలు మండలాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. నిత్యం దినపత్రికలు చదివే అలవాటు జిల్లా వాసులకు తక్కువ శాతమే ఉండగా, ఈ నెల 21వ కూడా ప్రజావాణి రద్దు కాగా, ఈసారి ఖచ్చితంగా ఉంటుందని కలెక్టరేటుకు వచ్చినట్లు అర్జీదారులు పేర్కొంటున్నారు. ఇతర జిల్లాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమం యధావిధిగానే కొనసాగుతుండగా, మన జిల్లాలో కూడా అలాగే జరుగుతుందనే భావనతో కూడా వచ్చినట్లు మరికొంతమంది చెబుతున్నారు.
సమయానికి ప్రజావాణి జరగటం లేదు..
సుదూర ప్రాంతాల నుంచి వందల రూపాయలు ఖర్చు చేస్తూ, తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వస్తే తీరా సమయానికి ప్రజావాణి జరగటం లేదు. ముందుగానే పత్రికా ప్రకటన కూడా విడుదల వేశామంటూ, కలెక్టరేట్ సిబ్బంది కసురుకుంటున్నారనే ఆవేదన అర్జీదారుల నుంచి వ్యక్తమవుతోంది. వాస్తవానికి ప్రజావాణి రద్దు చేస్తున్న సందర్భంలో శనివారం సాయంత్రమే పత్రిక ప్రకటన విడుదల చేస్తే ఆదివారం దినపత్రికల్లో అచ్చు అయి, ఎక్కువ మందికి తెలిసే అవకాశముంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కూడా ఇలాగే పలుమార్లు ప్రజావాణి రద్దు చేయగా, ముందస్తు సమాచారంతో ఆదివారమే దినపత్రికల్లో వార్తలు వస్తుండేవి. ప్రస్తుతం అంతగా ప్రాధాన్యమివ్వకపోవటంతో ప్రజలు మండే ఎండల్లో చెమటలు కక్కుతూ వస్తే, తీరా వచ్చిన అనంతరం ప్రజావాణి లేదు. పేపర్లో వచ్చింది అంటూ అర్జీదారులను సిబ్బంది దబాయిస్తూ నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పత్రికా ప్రకటన వెలువరించినా ఒకరిద్దరు అధికారులకు గతంలో మాదిరిగా ఆడిటోరియం సమీపంలో విధులు కేటాయిస్తే, ఇబ్బందులు పడేవారం కాదని అర్జీదారులు పేర్కొంటున్నారు. కాగా భారీ సంఖ్యలో అర్జీదారులు కలెక్టరేట్‌కు వస్తున్న విషయం తెల్చుకున్న ఏఓ గడ్డం సుధాకర్ అర్జీదారుల ఫిర్యాదులు ఇన్వర్డ్ సెక్షన్లో ఇవ్వాలంటూ సూచించగా, తమ ఆర్జీలు అక్కడి సిబ్బందికి అందజేసి వెనుదిరిగారు.
భూమి పంచాయితీ మీద ఫిర్యాదు చేసేందుకు వచ్చిన : అంజమ్మ, కొత్తపల్లి గ్రామం
మా భూమి పంచాయితీ మా ఊర్ల తెంపుతలేరు. కలెక్టరమ్మ దగ్గరికొచ్చి దరఖాస్తు ఇత్తే తొందరగా పని అయితదంటే నా మనుమరాలుతో కలిసి వచ్చిన. ఈడికొచ్చినంక ఇయ్యాల జరుగుతలేదు అని చెప్పిండు. పేపర్ సూడలేదా? ఎందుకచ్చినవని సార్లు అంటున్నరు? నాకు సదువే రాదయే.. పేపరెట్ల సూత్త, నేను గంత దూరం నుంచి నడి ఎండల వడి ఇక్కడికి వచ్చిన. ఎవ్వలన్న కలుత్తే కాయితమన్న ఇచ్చి పోదామని ఆగిన.
ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసేందుకు వచ్చిన: వి. మహేశ్వరి, మధురానగర్ కాలనీ, గంగాధర
మొన్న మా ఊరిలో చేసిన సర్వేలో ఇందిరమ్మ ఇల్లుకు నన్ను లబ్దిదారుగా ఎంపికైనట్లు చెప్పిండ్లు, ముగ్గు పోసుకుంటా అని కార్యదర్శిని అడుగుతే, నీకు రాలేదు అని అనటంతో, మళ్లా దరఖాస్తు చేసుకుంటామని నా కొడుకుతో కలిసి వచ్చిన. ఇక్కడికి వచ్చే దాకా ఇవ్వాళ్ల ప్రజావాణి లేదని తెలవదు. ఆడిటోరియం మూసి ఉంటే పదకొండు అవుతున్నా ఇంకా తీయలేదని అడిగితే, ఈ రోజు ప్రజావాణి రద్దు చేసినట్లు చెప్పారు. రెండు రోజుల ముందుగానే చెబితే వచ్చేవాళ్ళము కాదు. పోయిన సోమవారం కూడా వచ్చినం. గిట్లనే చేసిండ్లు. ఎన్నిరోజులు బంధు వెడుతారో ముందుగానే చెబితే బాగుంటది. కండ్ల నుంచి వేడి వస్తుంటే 20 కి.మీ. దూరం నుంచి మేము వచ్చేటోళ్లం కాదు కదా.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్