బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Oct 06, 2020 , 02:42:40

ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పకుండా వేయాలి

ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పకుండా వేయాలి

  • కలెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ అజీం 

నమస్తేతెలంగాణ నెట్‌వర్స్‌, అక్టోబర్‌05: నులి పురుగుల నివారణకు ఏడాది నుంచి 19 ఏళ్ల లోపు వారికి తప్పకుండా ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలని కలెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ అజీం అన్నారు. మహాముత్తారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం చిన్నారులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసి, నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంబించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. నులి పురుగులతో చిన్నారుల శారీర, మానసిక వికాసం మందగించడాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి  వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆల్బెండజోల్‌ మాత్రలు అందిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఈనెల 5 నుంచి 15 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందజేస్తున్న మండల వైద్యాధికారి గోపీనాథ్‌ను కలెక్టర్‌ అభినందించి, సన్మానించారు. అనంతరం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం నిర్మాణ స్థలం, రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మందల లతారెడ్డి, జడ్పీటీసీ లింగమల్ల శారద, డీంహెచ్‌వో సుధార్‌సింగ్‌, తహసీల్దార్‌ సునీత,  ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

నులి పురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యంనులి పురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవి అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాల సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ నులిపురుగులతో పిల్లల ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. ఆహారం తినేముందు పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ భానుకిరణ్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి బీ. హరికృష్ణ, మాజీ సర్పంచ్‌ కట్ల ప్రశాంతి, అంగన్‌వాడీ టీచర్‌ వెంకటరమణ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. గణపురం, చెల్పూర్‌ పీహెచ్‌సీ హెల్త్‌ సూపర్‌వైజర్లు బల్గూరి సమ్మయ్య, శోభ మండల పీహెచ్‌సీ పరిధి గ్రామాల్లోని 19 ఏళ్ల లోపు పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలో నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు.  ఏటూరునాగారం ఆకుల వారిఘనపూర్‌లోని సబ్‌సెంటర్‌లో చిన్నారులకు నులి పురుగుల నివారణ మాత్రలను సర్పంచ్‌ ఈసం రామ్మూర్తి పంపిణీ చేశారు.

వాజేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని మొరుమురు గ్రామ పంచాయతీలోని ఆర్‌గుంటపల్లి గ్రామంలో చిన్నారులకు ఆల్బెండజోల్‌ మాత్రలను ఎంపీపీ శ్యామాల శారద వేశారు. వాజేడులో జడ్పీటీసీ పుష్పలత చిన్నారులకు మాత్రలను వేశారు. మంగపేట మండలంలోని బోరునర్సాపురంలో అల్‌బెండజోల్‌ మాత్రల పంపిణీని సహకార డైరెక్టర్‌ నర్రా శ్రీధర్‌ ప్రారంభించారు. ములుగు మండలంలోని రాయినిగూడెం పీహెచ్‌సీ పరిధిలోని 14 సబ్‌ సెంటర్ల ద్వారా వైద్య సిబ్బంది మొదటి రోజు నులిపురుగుల నివారణ మాత్రలు 5793మంది పిల్లలకు వేసినట్లు వైద్యాధికారి పోరిక జోత్స్నాదేవి తెలిపారు. టేకుమట్ల మండలం వెలిశాల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అల్బెండజోల్‌ మాత్రలను చిన్నారు వేశారు. రామక్రిష్టపూర్‌(టీ)లో జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. పలిమెల మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో ఏఎన్‌ఎం శ్రీలత ఆధ్వర్యంలో ఆశావర్కర్‌ మాత్రలను పంపిణీ చేశారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సొమవారం నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ 20 శాతం పూర్తయిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని మహాముత్తారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఆయా పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని 19 ఏళ్లలోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను అందజేశారు. జిల్లాలోని రేగొండ పీహెచ్‌సీ పరిధిలో అధికంగా మాత్రల పంపిణీ చేశారు. కన్నాయిగూడెం, వెంకటాపూర్‌, చిట్యాల,  మండల్లాలోని అన్ని గ్రామాల్లో ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. భూపాలపల్లి లోని 16 వార్డులోని రాం నగర్‌, సుభాష్‌కాలనీల్లోని పిల్లలకు వార్డు కౌన్సిలర్‌ దాట్ల శ్రీనివాస్‌ మాత్రలు వేశారు.


logo