e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జనగాం ఫ్రీ కరంటు

ఫ్రీ కరంటు

  • లాండ్రీ, సెలూన్‌ షాపులకు ఉచిత విద్యుత్‌ పథకం
  • ప్రతి నెలా 250 యూనిట్లలోపు సరఫరా
  • ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నదరఖాస్తుల స్వీకరణ
  • విద్యుత్‌ లేని షాపుల్లో కొత్త మీటర్ల ఏర్పాటు
  • గత ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి స్కీం
  • జిల్లాలో ఇప్పటికే 1,860 మందికి లబ్ధి

వరంగల్‌, సెప్టెంబర్‌ 15 (నమస్తే తెలంగాణ) :ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా వారికి ప్రతి నెల 250 యూనిట్ల విద్యుత్‌ వరకు సబ్సిడీ ఇస్తున్నది. తద్వారా జిల్లాలో ప్రస్తుతం 1,860 మంది రజకులు, నాయీబ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారు. ఉపాధి కోసం రజకులు లాండ్రీ షాపులు, నాయీబ్రాహ్మణులు సెలూన్‌ షాపులు నిర్వహిస్తున్నారు. ఎన్పీడీసీఎల్‌ ఈ షాపులను కమర్షియల్‌ కింద పరిగణిస్తున్నది. వీటిలో కేటగిరీ-2 సర్వీసు మీటర్లను అమర్చి విద్యుత్‌ సరఫరా చేస్తున్నది. దీంతో లాండ్రీ, సెలూన్‌ షాపుల నిర్వాహకులు నెలనెలా పెద్ద మొత్తంలో విద్యుత్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. నెలలో కనీసం 250 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తే సుమారు చార్జీలు రూ.2 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి.

ఇలా సంపాదన విద్యుత్‌ చార్జీలకే పోతున్నందున ఉచిత విద్యుత్‌ సరఫరాతో తమను ఆదుకోవాలని రజకులు, నాయిబ్రాహ్మణులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో లాండ్రీ, సెలూన్‌ షాపులకు ఉచిత విద్యుత్‌ పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతినెల ఈ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం లాండ్రీ, సెలూన్‌ షాపుల్లో కొత్త విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు ఖర్చు ప్రభుత్వమే భరించాలని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడదల చేసింది. దీంతో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారులు లాండ్రీ, సెలూన్‌ షాపుల నిర్వాహకులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకం గత ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది.

- Advertisement -

కొత్త మీటరుకు రూ.6,970..
ఉచిత విద్యుత్‌ పథకం కోసం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అర్హత గల రజకులు, నాయీబ్రాహ్మణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మీ-సేవ కేంద్రాల ద్వారా లాండ్రీ, సెలూన్‌ షాపుల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. షాపులో తన వృత్తి నిర్వహిస్తున్న, షాపు ఫొటో, ఆధార్‌ నంబర్‌, కుల ధ్రువీకరణ పత్రం, కరంటు బిల్లు జిరాక్స్‌ కాపీని దరఖాస్తు వెంట జత చేశారు. కరంటు వసతి లేని వారు కొత్త సర్వీసు మీటరు కావాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా తమకు అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్న వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారులు అర్హత గల వాటికి ఆమోదముద్ర వేస్తున్నారు. ఇప్పటికే కేటగిరీ-2 కింద సర్వీసు మీటరు ఉండి కరంటు సరఫరా పొందుతున్న లాండ్రీ, సెలూన్‌ షాపుల నిర్వహకులకు ప్రతినెల 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు.

కరంటు వసతి లేని లాండ్రీ, సెలూన్‌ షాపులకు ఈ పథకం అమలు కోసం కొత్త సర్వీసు మీటరు ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నారు. ఒక్కో షాపులో కొత్త సర్వీసు మీటరు కోసం రూ.6,970 చొప్పున ఎన్పీడీసీఎల్‌కు చెల్లిస్తున్నారు. ఈ నిధులతో ఎన్పీడీసీఎల్‌ అధికారులు లాండ్రీ, సెలూన్‌ షాపులో గాని కేటగిరీ-2 కింద కొత్త మీటరు, 40 మీటర్ల సర్వీసు వైర్‌, మూడు ప్లగ్‌లతోపాటు ఇతర సామగ్రి సమకూర్చి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. అద్దె ఇండ్లు, రోడ్ల పక్కన, చెట్ల కింద డబ్బాల్లో నిర్వహిస్తున్న లాండ్రీ, సెలూన్‌ షాపులకు సైతం కొత్త మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తామని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే 1,860 మందికి లబ్ధి..
ఉచిత విద్యుత్‌ పథకం అమలు కోసం లాండ్రీ, సెలూన్‌ షాపుల నిర్వాహకుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. జిల్లా నుంచి ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు రెండు వేలు దాటినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే వీటిలో అర్హత గల 1,860 దరఖాస్తులకు ఆమోదం తెలిపి ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 1,065 లాండ్రీ షాపులు, 795 సెలూన్లకు 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకం అమలవుతున్నట్లు తెలిపారు. నెలనెల ఎన్పీడీసీఎల్‌ నుంచి ఈ షాపులకు సంబంధించిన విద్యుత్‌ చార్జీల బిల్లులు అందగానే ప్రభుత్వం నేరుగా ఎన్పీడీసీఎల్‌కు చెల్లిస్తున్నది. ప్రతినెల 250 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించుకునే లాండ్రీ, సెలూన్‌ షాపుల నిర్వాహకుల విద్యుత్‌ చార్జీలను మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక ఈ షాపుల నిర్వాహకుల్లో నెలనెల 250 యూనిట్లకు మించి విద్యుత్‌ వాడే వారికి ప్రభుత్వం 250 యూనిట్ల విద్యుత్‌ వరకు సబ్సిడీ ఇస్తుంది. జిల్లాలో ఉచిత విద్యుత్‌ పథకం పొందే లాండ్రీ, సెలూన్‌ షాపుల నిర్వాహకుల సంఖ్య త్వరలో మరింత పెరిగే అవకాశం ఉంది.

రూ.24 వేలు లబ్ధి పొందే అవకాశం..
వృత్తి పనిచేసే రజకులు, నాయీబ్రాహ్మణులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ పథకాన్ని తెచ్చింది. అర్హత గల వారు ఈ పథకానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ పథకం ద్వారా ఒక్కో లాండ్రీ, సెలూన్‌ షాపు నిర్వాహకుడు సంవత్సరానికి కనీసం రూ.24 వేలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఉన్నందున లాండ్రీ, సెలూన్‌ నిర్వాహకుల్లో అర్హత గల ప్రతిఒక్కరూ ఉచిత విద్యుత్‌ పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అద్దె ఇండ్లు, చెట్ల కింద, రోడ్డు పక్కన ఉన్న డబ్బాల్లో నిర్వహిస్తున్న లాండ్రీ, సెలూన్‌ షాపులకూ ఈ పథకాన్ని అమలు చేస్తం. వీటికీ కొత్త మీటర్లు మంజూరు చేస్తం. అపోహలు వద్దు.

  • ఎం నర్సింహస్వామి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి, వరంగల్‌ జిల్లా
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana