కృష్ణకాలనీ, ఏప్రిల్ 25 : పేదలకు ప్రభుత్వం ఇచ్చిన రెండు పడక గదుల ఇండ్లను అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. తాగు నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా మున్సిపల్ పరిధి 11వ వార్డు వేశాలపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కాలనీలో ఏర్పాటు చేసిన మంచినీటి సంపును పరిశీలించి, నిల్వ నీటి సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలోని నాల్గో అంతస్తు పైకి ఎక్కి వాటర్ ట్యాంకులను పరిశీలించారు.
మంచినీటి సరఫరాపై ప్రజలతో కలెక్టర్ ముఖాముఖి అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లు అమ్ముకోవద్దని, సగటున ఒక కుటుంబం అద్దె ఇంట్లో ఉంటే కనీసం రూ .2 వేల నుంచి రూ.3 వేలు అద్దె చెల్లించాల్సి వస్తుందన్నారు. సంవత్సరానికి సుమారు రూ.30 వేలు అవుతుందని, అద్దె కట్టలేని నిరుపేదలను గుర్తించి ఇండ్లు కేటాయించామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలే కానీ, అమ్ముకోవడం సరికాదన్నారు.
ఎవరైన ఇండ్లు అమ్మినా, కిరాయికి ఇచ్చినా కాలనీ కమిటీ స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేయాలన్నారు. ప్లంబర్, వాటర్ మెన్, ఇతరత్రా అవసరాల రిత్యా నగదు అవసరం అవుతుందని, లబ్దిదారులు ప్రతి నెలా కాలనీ నిర్వహణకు కొంత నగదు జమ చేసుకోవాలని సూచించారు. డ్రైనేజీతో పాటు కాలనీ చుట్టూ ప్రహరీ నిర్మాణం, విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కలెక్టర్‌ను కోరారు. దీంతో స్పందించిన ఆయన విడుతల వారీగా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ డీఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, ఏఈ రోజారాణి ఉన్నారు.