IRIS Dena : శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికన్ సబ్మెరైన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇండియన్ ఓషన్ (హిందూ మహాసముద్రం)లో జరిగింది. పైగా ఇరాన్ నౌక ఇండియా నుంచి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. దీంతో ఈ ఘటనలో ఇండియాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇండియాకు చెందిన జలాల్లో నౌకను అమెరికా కూల్చేస్తుంటే ఇండియా ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆ నౌక ఇండియా నుంచి వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో మరింత వివాదంగా మారింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
భారత చేతగానితనం వల్లే మన సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా వచ్చి దాడులు చేస్తోందని విమర్శిస్తున్నారు. అయితే, ఈ అంశంపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. ఈ ఘటనకు, ఇండియాకు ఏం సంబంధం లేదని, ఇండియా భాద్యత ఎంతమాత్రం లేదని అంటున్నారు. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనా గత నెలలో విశాఖపట్నం వచ్చింది. 74 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఇక్కడికొచ్చాయి. అమెరికా మాత్రం ఈ నావికా విన్యాసాల్లో పాల్గొనలేదు. ఇక్కడ జరిగిన నావికా విన్యాసాల్లో ఇరాన్ నౌక పాల్గొని, తిరిగి వెళ్తుండగా అమెరికన్ సబ్మెరైన్ కూల్చేసింది. ఇది జరిగింది ఇండియన్ ఓషన్లోనే అయినా.. అది భారత ప్రాదేశిక జలాలకు సంబంధించింది కాదు. శ్రీలంక నుంచి 40 నాటికన్ మైళ్ల దూరంలో నౌకను అమెరికా పేల్చింది. కారణం.. ఈ ప్రదేశం భారత సముద్ర భాగానికి సంబంధించినది కాదు. అది అంతర్జాతీయ జలమార్గం. ఇక్కడ ఇండియాకు ఎలాంటి హక్కూ ఉండదు. ఈ సముద్రానికి మన ఇండియా పేరే పెట్టినప్పటికీ, దీనిపై మనకు పూర్తి ఆధిపత్యం ఉండదు.
అంటే ఘటన జరిగిన జలాల్లో నిబంధనల ప్రకారమే మనకు హక్కు ఉంటుంది. ఈ సముద్రం 70 మిలియన్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇందులో ఇండియా ఒక్కటే కాకుండా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలు వ్యాపించి ఉన్నాయి. అందువల్ల ఇండియా మాత్రమే ఈ సముద్ర జలాలకు యజమాని కాదు. అంతర్జాతీయ నిబంధనల్ని అనుసరించి మాత్రమే ఇండియా వ్యవహరిస్తుంది. శ్రీలంకకు సమీపంలో, ఆ దేశ ఆర్థిక జోన్లో జరిగిన ఘటన ఇది. అందువల్ల భారత్కు ఏం సంబంధం లేదనేది నిపుణుల మాట. పైగా ఈ నౌకకు సంబంధించి ఎలాంటి రక్షణా సాయాన్ని ఇరాన్ కోరలేదు. ఒకపక్క యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ నౌక ఇండియా జలాలను వదలాల్సింది కాదనేది మరికొందరి వాదన. ఇండియా తీరంలోనే ఉండుంటే ఈ దాడి తప్పే అవకాశం ఉండేదని కొందరి అభిప్రాయం.