బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 14, 2020 , 09:01:11

ఇట‌లీలో క‌రోనా.. ఎందుక‌న్ని మ‌ర‌ణాలు ?

ఇట‌లీలో క‌రోనా.. ఎందుక‌న్ని మ‌ర‌ణాలు ?

హైద‌రాబాద్‌:  చైనాలోని వుహాన్ త‌ర్వాత‌.. క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య ఇటలీలో ఎక్కువ‌గా ఉన్న‌ది. ఎందుకు ఆ దేశంలో అన్ని మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌న్న దానిపై శాస్త్ర‌వేత్త‌లు ఓ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్ర‌స్తుతం ఇటలీలో ఆ వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయిన వారి సంఖ్య 1266కు చేరుకున్న‌ది.  ఇక యూరోప్‌లోని స్పెయిన్‌లో 121 మంది, ఫ్రాన్స్‌లో 79 మంది, బ్రిట‌న్‌లో 11 మంది మ‌ర‌ణ‌ఙంచారు. ఈ దేశాల్లో వైర‌స్ సోకిన వారి సంఖ్య వేల‌ల్లో ఉన్న‌ది.  ఇట‌లీలో సుమారు 18 వేల మంది నోవెల్ క‌రోనా వైర‌స్ సోకింది. అంతే కాదు ఆ దేశంలో మ‌ర‌ణ రేటు 7 శాతంగా న‌మోదు అయ్యింది.  ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మృతుల రేటు 3.4 శాత‌మే ఉండ‌గా.. ఇట‌లీలో మాత్రం తాజా రిపోర్ట్ ప్ర‌కారం 5 శాతంగా న‌మోదైంది.  

ఇది నిజంగా క‌ల‌వ‌రం చెందాల్సిన విష‌య‌మే. ఆరు కోట్ల జ‌నాభా ఉన్న ఇట‌లీలో.. ఎందుకు క‌రోనా అంత ప్రాణాంత‌కంగా మారిందో కొన్ని అంశాల‌ను విశ్లేషించుకోవాల్సి వ‌స్తోంది.  యూరోప్ దేశాల్లో ఉన్న జ‌నాభాలో.. ఇట‌లీ ప్ర‌జ‌లే ఎక్కువ శాతం వృద్ధులు.  ఆ దేశ జ‌నాభాలో సుమారు 23 శాతం మంది వ‌య‌సు 65 ఏళ్లు దాటింది.  అక్క‌డ స‌గ‌టు వ‌య‌సు ప్ర‌స్తుతం 47.3 ఏళ్లుగా ఉన్న‌ది.  అదే అమెరికాలో స‌గ‌టు వ‌య‌సు 38.3గా ఉన్న‌ది. ఇక ఇట‌లీలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారిలో ఎక్కువ శాతం మంది 80 లేదా 90 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌వారే. అంటే కోవిడ్‌19 వ్యాధి ఈ వ‌య‌సు వారిని ప‌ట్టి పీడించ‌డం సుల‌వవుతుంది.  

ఓ ప్రాంతంలో ఉన్న జ‌నాభా ఆధారంగానే వైర‌స్ వ‌ల్ల మృతిచెందుతున్న వారి సంఖ్య ఆధార‌ప‌డి ఉంటుంద‌ని మిచిగ‌న్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఒక‌రు తెలిపారు.  ఇట‌లీ జ‌నాభాలో ఎక్కువ‌గా వృద్ధులు ఉండ‌డం ఒక కార‌ణ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. యువ‌కులు ఎక్కువ‌గా ఉన్న దేశంతో పోలిస్తే.. వృద్ధులు ఎక్కువ‌గా ఉన్న దేశంలో మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉంటుందంటున్నారు.  వ‌య‌సు మీద‌ప‌డిన వారికి సాధార‌ణంగా క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్ లాంటి వ్యాధులు ఉంటాయి.  ఆ వ్యాధుల వ‌ల్ల వారి ఇమ్యూనిటీ త‌గ్గుతుంది. ఇక నోవెల్ క‌రోనా లాంటి విష‌పూరిత వైర‌స్‌లు ఆ వృద్ధుల‌ను బ‌లితీసుకుంటాయ‌ని వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్లు తెలిపారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు కొన్ని కొన్ని ఉన్న‌వారిని గుర్తించ‌డం జ‌ర‌గ‌డం లేద‌ని, ఒక‌వేళ వైర‌స్ ప‌రీక్ష‌లు విస్త‌రిస్తే, అప్పుడు ఎవ‌రెవ‌రికి వైర‌స్ సోకిందో స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.   


logo