The Fort Blunder and Fort Montgomery | పొరపాటు చేయడం సహజమే ! మనిషి అన్నాక తప్పు చేయడం మాములు విషయమే !! కానీ అమెరికా చేసిన ఓ తప్పు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. అంత పెద్ద తప్పేంటి అనుకుంటున్నారా !! అప్పట్లో కెనడాలో నుంచి మాటిమాటికి అమెరికాలోకి చొరబడేందుకు బ్రిటీష్ సైన్యం ప్రయత్నించేది. దీంతో ఎలాగైనా వారికి ఎదుర్కోవాలని ఒక కోటను కట్టుకోవాలని అమెరికా ప్రభుత్వం భావించింది. కట్టుదిట్టమైన రక్షణతో భారీ కోటను కూడా నిర్మించింది. ఇది మంచి నిర్ణయమే కదా ! అందులో తప్పేముంది అని అనుకుంటున్నారా? అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అమెరికా అంత కష్టపడి కోట కట్టింది అమెరికాలో కాదు.. బ్రిటీష్ సైన్యం ఆధీనంలో ఉన్న కెనడాలో !! ఆలస్యంగా ఈ విషయాన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం నాలుక కరుచుకుంది. సైలెంట్‌గా నిర్మాణ పనులను ఆపేసి.. ఆ కోటను వారికే వదిలేసి అక్కడి నుంచి జారుకుంది. 18వ శతాబ్దంలో జరిగిన తప్పిదం చరిత్రలో నిలిచిపోయింది.
ప్రపంచంలో చాలా దేశాలు బ్రిటీష్ పాలన కింద ఉండేవి. అగ్ర రాజ్యం అమెరికా కూడా ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందినదే. 1776 జూలై 4న అమెరికాకు స్వాంతంత్య్రం వచ్చింది. కానీ అమెరికాను అనుకుని ఉన్న కెనడాలో మాత్రం చాలా కాలం వరకు బ్రిటీష్ పాలననే కొనసాగింది. ఆ సమయంలో కెనడాలో ఉన్న బ్రిటీష్ సైన్యం అమెరికా భూభాగంలో అడుగుపెట్టేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. వాళ్ల ప్రయత్నాలను అమెరికా తిప్పికొట్టేది. ఈ క్రమంలోనే 1812-1815 మధ్య అమెరికాకు, కెనడాలో ఉన్న బ్రిటీష్ సైన్యానికి మధ్య యుద్ధం కూడా జరిగింది. ఈ యుద్ద సమయంలో లేక్ చాంప్లేన్ అనే ప్రాంతం బాగా దెబ్బతింది. ఈ ప్రాంతం నుంచి బ్రిటీష్ సైన్యం అమెరికాలోకి చొరబడేందుకు మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉందని భావించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మేడిసన్.. లేక్ చాంప్లేన్ సరస్సు చుట్టూ భారీ కోట నిర్మించాలని భావించాడు. 30 అడుగుల ఎత్తులో ఈ కోటను నిర్మించి.. అందులో ఆయుధాలను సమకూర్చుకుంటే.. బ్రిటీష్ సైన్యాన్ని సులువుగా ఎదుర్కోవచ్చని అనుకున్నాడు. దీంతో 186లో లేక్ చాంప్లేన్ సరస్సు చుట్టూ భారీ కోటను నిర్మించాలని నిర్ణయించారు. ఈ లేక్ చాంప్లేన్ ( Lake Champlain ) న్యూయార్క్ రాష్ట్ర పరిధిలో ఉండటంతో అక్కడి ప్రభుత్వం కోట నిర్మాణం కోసం 400 ఎకరాలు కేటాయించింది.
ఇలా భూమి కేటాయించడం ఆలస్యమే లేదు.. అధికారులు కోట నిర్మాణం ప్రారంభించారు. 1817లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జేమ్స్ మన్రో కూడా స్వయంగా ఈ ప్రాంతాన్ని, కోట నిర్మాణ పనులను పరిశీలించారు. దాదాపు కోట నిర్మాణం పూర్తి కావడానికి దగ్గరికొచ్చింది. ఆ సమయంలో తాము చేసిన పొరపాటు తెలిసిన అధికారులు నాలుక కరుచుకున్నారు. ఇంతకీ వాళ్లు చేసిన పొరపాటు ఏంటో తెలుసా ! అమెరికాలో నిర్మించాల్సిన కోటను వేరే దేశంలో నిర్మించారు. అది కూడా ఏ దేశం నుంచి తమ శత్రువులు (బ్రిటీష్ సైన్యం) రావద్దని భావించారో.. అదే దేశంలో.. అంటే కెనడా భూభాగంలోనే ఈ కోటను నిర్మించారు. మొత్తానికి జరిగిన పొరపాటును తెలుసుకున్న అధికారులు అయోమయంలో పడిపోయారు.
నిజానికి కోట నిర్మించిన ప్రాంతం ముందు అమెరికాలోనే ఉండేది. కానీ 1783 పారిస్ ఒప్పందం ప్రకారం మాత్రం లేక్ చాంప్లేన్ ( Lake Champlain ) కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ కిందకు వెళ్లింది. తొందరగా కోటను నిర్మించాలన్న ఉత్సుకతలో అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చకాచకా భూమిని కేటాయించడం.. కోటను నిర్మించడం మొదలుపెట్టేశారు. చాలా రోజులకు అధికారులకు అసలు విషయం గుర్తొచ్చింది. కానీ ఏం లాభం.. అప్పటికే కోట నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. దీంతో ఇక చేసేదేమీ లేక సైలెంట్‌గా ఆ కోట నిర్మాణ పనులను నిలిపివేశారు. నిర్మాణ సామగ్రిని తీసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అమెరికా ప్రభుత్వం చేసిన ఈ తప్పిదానికి గుర్తుగా అప్పటి నుంచి ఆ కోటను ఫోర్ట్ బ్లండర్ ( The Fort Blunder ) అని స్థానికులు పిలవడం మొదలుపెట్టారు. కోట నిర్మాణం ఆపేసిన తర్వాత దాదాపు 20 ఏండ్ల పాటు ఆ కోటను ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ కోటపై స్థానికుల కన్నుపడింది. కోటలోని రాళ్లు, ఇతర నిర్మాణ సామగ్రిని స్థానికులు ఎత్తుకెళ్లి.. తమ ఇళ్లు, షాపుల నిర్మాణానికి వినియోగించుకున్నారు.
కోట నిర్మాణం ఆగిపోయిన తర్వాత చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఆ సమయంలో అమెరికా, కెనడాలోని బ్రిటన్ అధికారుల మధ్య చాలాసార్లు చర్చలు జరిగాయి. చివరకు 1842లో జరిగిన చర్చలు సఫలం కావడంతో కెనడాతో ఉన్న సరిహద్దులను పునరుద్ధరించి.. లేక్ చాంప్లేన్ను అమెరికా స్వాధీనం చేసుకుంది. కానీ అప్పటికే ఫోర్ట్ బ్లండర్ ( The Fort Blunder ) కోటలోని రాళ్లు, సామగ్రిని అందరూ దోచుకెళ్లారు. దీంతో అమెరికా ప్రభుత్వం ఆ కోట పక్కనే మరో కోటను నిర్మించి, దానికి బ్రిటన్‌తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన మేజర్ జనరల్ రిచర్డ్ మాంట్గమొరీ పేరును పెట్టింది. కానీ ఈ కోటను 1926లో అమెరికా ప్రభుత్వం వేలం పాటలో అమ్మేసింది. అప్పటి నుంచి ఫోర్ట్ మాంట్ గమొరీ ( Fort Montgomery ) అనేక చేతులు మారింది. చివరకు 1983లో విక్టర్ పాడ్ అనే వ్యక్తి ఈ కోటను దక్కించుకున్నాడు. కానీ అతను కూడా 2006లో దీన్నిఈ బేలో అమ్మకానికి పెట్టాడు. కానీ చాలా రోజుల పాటు ఆ కోట అమ్ముడుపోలేదు. ప్రస్తుతం ఈ కోటను న్యూయార్క్ గవర్నమెంట్.. హెరిటేజ్ టూరిస్ట్ ప్లేస్ ( చారిత్రక పర్యటక ప్రాంతం)గా మార్చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అర్ధరాత్రైనా ఇక్కడ పగల్లాగే ఉంటుంది.. సూర్యుడు అస్తమించని ప్రాంతాలివే..
Whistle village : ఆ ఊళ్లో పేర్లు ఉండవ్.. విజిల్‌తోనే పిలుచుకుంటరు
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
ఆ 2 ద్వీపాల మధ్య దూరం 4 కిలోమీటర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
ప్రేమ కోసం రాజరికాన్ని, రాజభోగాలను వదిలేసిన యువరాజులు, యువరాణులు వీళ్లే..
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !