Pre eclampsia | గర్భిణుల్లో ఈ సమస్య అంత ప్రాణాంతకమా? దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Pre eclampsia | గర్భిణి జీవితంలో తొమ్మిది నెలలూ కీలకమే. పొట్టలోని బిడ్డ ఎదిగే క్రమంలో అమ్మకు ఎన్నో గండాలు. అనేక రుగ్మతలు అవకాశం కోసం కాచుకుని ఉంటాయి. ప్రతి సమస్యనూ గర్భధారణ సమయంలో కనిపించే సాధారణ లక్షణాలుగానే భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా.. ప్రీ ఎక్లాంప్సియాను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు ఈ రుగ్మత తల్లీబిడ్డల ప్రాణాలకూ గురిపెడుతుంది.
ప్రతి మహిళా తన జీవితం మాతృత్వంతోనే పరిపూర్ణం అవుతుందని భావిస్తుంది. గర్భం దాల్చిన దగ్గర నుంచీ అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ చాలామంది తమ శరీరంలో వస్తున్న మార్పుల గురించి డాక్టర్లతో ధైర్యంగా చర్చించరు. ఇవన్నీ గర్భధారణ సమయంలో సాధారణమేమో అని సరిపెట్టుకుంటారు. ఇలాంటి చిన్నచిన్న తప్పిదాల వల్లే తీవ్ర సమస్యల బారినపడి తల్లీబిడ్డలు ప్రాణాపాయస్థితికి చేరుకున్న సందర్భాలు అనేకం. ‘ప్రీ ఎక్లాంప్సియా’ కూడా ఇలాంటి సమస్యే. గర్భధారణ సమయంలో రక్తపోటు, మూత్రంలో అధిక ప్రొటీన్ పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ప్రీ ఎక్లాంప్సియా బారినపడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని సర్వేలు చెబుతున్నాయి. అమెరికాలో ఈ తీవ్రత 2-6 శాతం ఉంటే, మనదేశంలో 8-10 శాతం వరకూ నమోదు అవుతున్నది. సాధారణంగా వ్యాధి ప్రభావం 34 వారాల తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. రుగ్మత నుంచి పూర్తిగా కోలుకోవడానికి కాన్పు తర్వాత ఆరువారాల వరకూ పడుతుంది. గర్భధారణకు ముందే రక్తపోటు సమస్య ఉంటే.. ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. వంశపారంపర్యం నుంచి అనారోగ్యకర జీవనశైలి వరకు కారణం ఏదైనా ఉండొచ్చు.
చికిత్స అందకపోతే..
ప్రీ ఎక్లాంప్సియా సమస్యను సమర్థంగా నియంత్రించకపోతే తల్లీబిడ్డలు ఇద్దరికీ ప్రమాదమే. కాబట్టి, గర్భిణిలో అసాధారణంగా బీపీ పెరగడం, మూత్రంలో తీవ్ర స్థాయిలో ప్రొటీన్ ఉండటం తదితర సంకేతాలు కనిపించగానే వైద్యం ప్రారంభిస్తారు. ఇదేదో సాధారణ గర్భధారణ సమస్య
అనుకుని నిర్లక్ష్యం చేస్తే.. గర్భిణికి ఫిట్స్ రావచ్చు. తల్లిలో అధిక రక్తపోటు వల్ల బిడ్డకు రక్త సరఫరా సరిగా జరగకపోవచ్చు. దీంతో నెలలు నిండకుండానే కాన్పు అవుతుంది. ఎదుగుదల సరిగా లేకపోవడంవల్ల పిల్లలు బలహీనంగా పుడతారు. అలాగే, రక్తపోటు తీవ్రత వల్ల మాయ విడిపోయి రక్త సరఫరా స్తంభించి బిడ్డ ప్రాణాలు పోవచ్చు. తల్లిలో ఫిట్స్, అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టే తత్వాన్ని కోల్పోవడం, బీపీ పెరగడం.. ఇవన్నీ కాలేయం, మూత్రపిండాలు, మెదడు, గుండె తదితర భాగాలపై ప్రభావం చూపుతాయి.
ఎవరిలో అధికం
మొదటిసారి గర్భం దాల్చినవాళ్లలో ఈ రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే బీపీ, ఊబకాయం కూడా ఓ కారణమే. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఇలా జరుగుతుంది. ముప్పై ఏండ్లు దాటాక గర్భం దాల్చినా, కడుపులో కవలలు ఉన్నా.. ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు ఉన్నవారినీ వదిలిపెట్టదు. గర్భధారణ తర్వాత వచ్చే ‘డయాబెటిస్ ప్రీ ఎక్లాంప్సియా’ రక్తపోటును తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రొటీన్యూరియా పరీక్ష, రక్త పరీక్షలు, మూత్రపిండాలు, కాలేయ పరీక్షలు చేయించుకోవాలి. వీటిలో ఏ ఒక్కటి అసాధారణంగా అనిపించినా తక్షణ చికిత్స ప్రారంభించాలి. పరిస్థితులను బట్టి సాధారణ కాన్పు లేదా సిజేరియన్ అవ్వొచ్చు. కొన్నిసార్లు, పెద్ద ప్రాణాన్ని కాపాడటానికి బిడ్డను తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.
లక్షణాలను గుర్తించి..
గర్భధారణలో ప్రతి నెలా కీలకమే. తొమ్మిది నెలలూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యంలో వస్తున్న మార్పులను గమనించుకోవాలి. ఇంట్లో బీపీ మెషీన్ పెట్టుకుని తరచూ పరీక్షించుకోవాలి. ఒకవేళ గతవారం కంటే, తర్వాత వారం బీపీ మరీ ఎక్కువగా పెరిగితే వైద్యులను సంప్రదించాలి. అలాగే తలనొప్పి, కడుపునొప్పి, రక్తస్రావం, బరువు పెరగడం, తల తిరగడం, మూత్రం తక్కువగా రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతంగా వాంతులు, కంటిచూపు మసకబారడం, అలసట, శ్వాస సమస్యలు మొదలైన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌కు చెప్పాలి. ప్రాథమిక దశలో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లతో సమస్యలను తగ్గిస్తారు. అయినా పరిస్థితి నియంత్రణలోకి రాకపోతే, డెలివరీ చేసి బిడ్డను బయటకు తీస్తారు. వ్యాధికి మూల కారణాలను తెలుసుకొని, తదనుగుణంగా జీవనశైలిని మార్చుకోవడమే ఉత్తమ మార్గం. రోజువారీ ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. బరువు విషయంలో జాగ్రత్త పడటం, రోజూ తగిన వ్యాయామం చేయడం, ప్రెగ్నెన్సీకి ముందే రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించడం, పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. రెండో త్రైమాసికంలో బీపీ తగ్గుతుంది. అలా జరగకుండా, హఠాత్తుగా పెరిగినా కూడా వ్యాధి లక్షణంగానే భావించాలి. ప్రసవ సమయంలో తీవ్ర అనారోగ్యం పాలైన గత చరిత్ర ఉన్నవారు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ మంజులా అనగాని, క్లినికల్ డైరెక్టర్,
డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ, కేర్ హాస్పిటల్స్
…✍ నిఖిత నెల్లుట్ల
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
గర్భదారణ సమయంలో యోగాసనాలు వేయొచ్చా.. ? వజ్ర త్రికోణాసనం ఎలా వేయాలి ?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?
థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?
Pregnancy | ఉమ్మ నీరు ఎక్కువైతే ప్రమాదమా?
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health news
- pregnancy
- Pregnant
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

