Donald Trump : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన ‘ట్రూత్ సోషల్ (Truth Social)’ వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆ రెండు దేశాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమమార్గంగా పేర్కొన్నారు. కాల్పుల విరమణ నిలబడే అవకాశాలు తక్కువేనని చెప్పారు.
అదేవిధంగా జెలెన్స్కీ అమెరికా పర్యటనను ట్రంప్ ధ్రువీకరించారు. పుతిన్‌తో తాజా చర్చల విషయాన్ని ప్రస్తావించారు. ‘అలాస్కాలో ఇదొక గొప్ప, విజయవంతమైన రోజు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం చాలాబాగా జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, నాటో సెక్రెటరీ జనరల్ ఇతర ఐరోపా నేతలతో ఫోన్లో వేర్వేరుగా మాట్లాడాను. నేరుగా శాంతి ఒప్పందానికి వెళ్లడమే యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గంగా ఓ నిర్ణయానికి వచ్చాం. కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది. జెలెన్స్కీ సోమవారం ఓవల్ కార్యాలయానికి రానున్నారు. అన్ని సవ్యంగా సాగితే పుతిన్‌తో సమావేశాన్ని షెడ్యూల్ చేస్తాం. తద్వారా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుంది’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన ఈ సమావేశాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని ట్రంప్ తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసేవరకు ఒప్పందం జరగదన్నారు.