Ukraine president : ఉక్రెయిన్ (Ukraine) తో యుద్ధానికి ముగింపు పలకడం కోసం అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) శుక్రవారం అలాస్కాలో భేటీ అయ్యారు. ఆ భేటీ జరిగిన కొన్ని గంటలకే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) తో, యూరోపియన్ యూనియన్ నేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. సోమవారం జెలెన్స్కీ, ట్రంప్ ఇద్దరూ వాషింగ్టన్లో భేటీ కానున్నట్లు సమాచారం.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాస్కాలో సమావేశం అనంతరం తిరుగు ప్రయాణంలో ట్రంప్ జెలెన్స్కీతో ఫోన్ మాట్లాడినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జెలెన్స్కీ ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. ట్రంప్‌తో గంటన్నరకు పైగా ఫోన్లో మాట్లాడానని అన్నారు. శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌కు తెలిపినట్లు చెప్పారు. పుతిన్‌తో సమావేశంలో చర్చించిన ముఖ్య విషయాలను ట్రంప్ తనకు తెలియజేసినట్లు వెల్లడించారు.
త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నానని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. కీలక అంశాలపై చర్చించుకునేందుకు అదొక మంచి వేదిక అవుతుందన్నారు. పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకు ఉందని ఈ సందర్భంగా అన్నారు. సోమవారం వాషింగ్టన్ డీసీలో ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించే అన్ని విషయాలపై అక్కడ చర్చిస్తానన్నారు. శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ నాయకులకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు.