హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీచేసింది. జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలల్లో అత్యంత భారీ వర్షాలుకురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మంచిర్యాలలో 7.18 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదయింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 6.5 సెం.మీ., ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 5.45 సెం.మీ వర్షపాతం నమోదయింది. అదేవిధంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాలు నీటమునిగాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 14.7 సెం.మీ., నల్లవల్లి 9.7, చౌటకుర్ 9, అమీన్పూర్ 8.1, ఝరాసంగం 7.4, మెదక్ జిల్లా శివంపేటలో 12.8 సెం.మీ. వర్షతానం నమోదయింది.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. మూడ్రోజులు అత్యంత భారీ వర్షాలు