హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి, ఒడిశా దిశగా కదులుతున్నదని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీచేసినట్టు పేర్కొన్నది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మబూబాబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.