Sarkar 4 | సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఐకానిక్ పొలిటికల్ క్రైమ్ ఫ్రాంచైజీ ‘సర్కార్’ నుంచి నాలుగో భాగాన్ని అధికారికంగా ప్రకటించారు. ముంబైలో జరుగుతున్న రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ (Red Lorry Film Festival) ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ‘సర్కార్ 4’ (Sarkar 4) చిత్రానికి సంబంధించిన పనులను వచ్చే నెల నుంచే ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. 2005లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సర్కార్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2008లో ‘సర్కార్ రాజ్’, 2017లో ‘సర్కార్ 3’ చిత్రాలు విడుదలయ్యాయి. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఈ సిరీస్‌లో మరో భాగం వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా వర్మ తన మరో ప్రాజెక్ట్ ‘ది సిండికేట్’ గురించి కూడా ప్రస్తావించారు. అదేవిధంగా ఫిల్మ్ ఫెస్టివల్లో తన క్లాసిక్ హిట్ ‘శివ’ చిత్ర ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్న ఆయన, ఆ సినిమా మేకింగ్‌పై హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ప్రభావం ఉందని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న యువ దర్శకుల్లో ఆదిత్య ధర్ ప్రతిభావంతుడని కొనియాడారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ‘సర్కార్ 4’లో సుభాష్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ మళ్లీ ఎలా ఉండబోతున్నాడా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.