వాషింగ్టన్: తననుతాను గొప్ప మధ్యవర్తిగా, ప్రపంచ శాంతి దూతగా ఆవిష్కరించుకునేందుకు ఉబలాటపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ (Hillary Clinton) బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపినట్లయితే ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తానని హిల్లరీ చెప్పారు. అయితే ఒక షరతు ఉందంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఉక్రెయిన్ తన భూభాగాన్ని రష్యాకు వదులుకోవాల్సిన అవసరం లేకుండాని రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ముగించాలని పేర్కొన్నారు. అలా చేసినట్లయితే అమెరికా అధ్యక్షుడిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తాని వెల్లడించారు. రేజింగ్ మోడరేట్స్ పాడ్‌కాస్ట్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ ఈమేరకు ప్రకటన చేశారు.
నిజాయితీగా చెప్పాలంటే, ఉక్రెయిన్ తన భూమిని దురాక్రమణదారు దేశానికి (రష్యాకు) వదిలివేయాల్సిన అవసరం లేని విధంగా, ఇప్పటివరకు మనం చూడని విధంగా పుతిన్‌కు వ్యతిరేకంగా దృఢంగా నిలబడగలిగే విధంగా మూడేండ్లుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేలా చూడాలని హిల్లరీ పేర్కొన్నారు. ట్రంప్ దాని రూపశిల్పి అయితే, ఆయనను నోబెల్ బహుమతికి ప్రతిపాదిస్తానన్నారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేండ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించడమే ప్రధాన అజెండాగా అలాస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ కొనసాగింది. సుమారు 3 గంటలపాటు సాగిన ఈ సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. అయితే ట్రంప్, పుతిన్ మధ్య చర్చలలో యుద్ధానికి ఒక పరిష్కారం లభించే అవకాశాలు చాలా తక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శాంతి కోసం రష్యా, ఉక్రెయిన్ పెడుతున్న షరతులే దీనికి ప్రధాన కారణం. కాల్పుల విరమణ కోసం ఉక్రెయిన్‌కి పశ్చిమ దేశాల నుంచి ఆయుధాల సరఫరా నిలిపివేయాలని, ఉక్రెయిన్ ఆయుధాల సమీకరణ స్తంభింపచేయాలన్న పుతిన్ షరతును ఇప్పటికే ఉక్రెయిన్, దాని మిత్రదేశాలు తిరస్కరించాయి. అదేవిధంగా తమ భేటీ తర్వాత అలస్కాలోనే జెలెన్స్కీతో కలిపి మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్న ట్రంప్ ప్రతిపాదనను పుతిన్ తోసిపుచ్చారు. కాగా, పుతిన్‌తో జరిగే చర్చలలో తక్షణమే కాల్పుల విరమణపై అవగాహన కుదురుతుందని తాను కచ్చితంగా చెప్పలేనని, 25 శాతం మాత్రమే విజయవంతం అయ్యే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.