Krishnashtami : ఉడుపిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. శ్రీకృష్ణ మఠం వారు నిర్వహించే ఈ వేడుకలను చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే ఈ ఏడాది ఉడుపిలో జన్మాష్టమి వేడుకలు నెల ఆలస్యంగా జరగనున్నాయి. సాధారణంగా దేశమంతటా కృష్ణాష్టమి వేడుకల కోసం చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. కానీ ఉడుపిలో శ్రీకృష్ణ మఠం వారు మాత్రం సూర్యమాన క్యాలెండర్ను అనుసరిస్తూ వస్తున్నారు.
సూర్యమాన క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 14న రోహిణీ నక్షత్రం అష్టిమి తిథితో కలువనుంది. శ్రీకృష్ణ మఠం వారు అదేరోజు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆర్ఘ్య ప్రధానం లాంటి ప్రతీకాత్మక క్రతువులను మాత్రం ఇవాళ జరిపించారు. దాంతో ఇవాళ ఉడుపికి చేరుకున్న భక్తులు, పూలు అమ్ముకోవడం వచ్చిన వ్యాపారులు నిరుత్సాహానికి గురయ్యారు.
వేడుకలు చూస్తామని వచ్చిన భక్తులు.. అసలైన వేడుకలు వచ్చే నెల 14న జరుగుతాయని తెలుసుకుని నిరుత్సాహానికి గురయ్యారు. పూల వ్యాపారులు అమ్ముడుపోని పూలతో దిగాలుగా కనిపించారు. అంటే వేడుకల వాయిదావల్ల కేవలం భక్తులే కాకుండా అక్కడి చిరు వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే వచ్చే నెల 14న జరిగే వేడుకలు తమ నష్టాన్ని పూడుస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.