Cockpit Door : విధుల్లో ఓ పైలట్ (Pilot) నిర్లక్ష్యం ప్రదర్శించాడు. విమానం రన్నింగ్‌లో ఉండగా కాక్‌పిట్ డోర్ (Cockpit Door) తెరిచే ఉంచాడు. దీన్ని విమానయాన సంస్థ తీవ్రంగా పరిగణించింది. పైలట్ ఉగ్రవాద నిరోధక నిబంధనలను ఉల్లంఘించాడని అతడిపై సస్పెన్షన్ వేటువేసింది. లండన్ నుంచి అమెరికా వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ (British Airways) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన విమానం లండన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. పైలట్ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. దాంతో విమానాన్ని ఆపరేట్ చేసే విధానాన్ని కుటుంబసభ్యులు చూసేందుకు వీలుగా పైలట్ కాక్‌పిట్ డోర్‌ను చాలాసేపు తెరిచే ఉంచాడు. దీనిపై తొలుత ఆశ్చర్యపోయిన ప్రయాణికులు, సిబ్బంది తర్వాత తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అమెరికాలో విమానం ల్యాండ్ కాగానే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు అతడిపై చర్యలు తీసుకున్నారు. న్యూయార్క్ నుంచి తిరిగి లండన్ రావాల్సిన విమానాన్ని రద్దు చేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ భద్రతా ఉల్లంఘనకు సంబంధించి సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా అత్యవసర దర్యాప్తు చేపట్టింది.