Donald Trump | ‘బ్రిక్స్’ (BRICS) దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతకొంతకాలంగా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. కూటమి దేశాల పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికన్ డాలర్ (dollar) స్థానంలో వేరే కరెన్సీ తెచ్చేందుకు ప్రయత్నిస్తే 150 శాతం సుంకాన్ని (tariff) విధిస్తామని పలుసార్లు తీవ్రంగా హెచ్చరించారు. తాజాగా బ్రిక్స్ దేశాలపై మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు. సుంకాలు విధిస్తామనగానే బ్రిక్స్ చెల్లాచెదురైపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘బ్రిక్స్ దేశాలు డాలర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని సృష్టించాలనుకున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొస్తే బ్రిక్స్‌పై 150 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పగానే అందులోని దేశాలు పరస్పరం దూరం జరిగాయి. తర్వాత ఆ కూటమి మాటే వినిపించడం లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకురావాలని బ్రిక్స్ దేశాలు ఆలోచిస్తున్నాయనే వార్తలపై ట్రంప్ గతంలో ఘాటుగా స్పందించారు. మోదీతో భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్రిక్స్ ఒక చెడ్డ ప్రతిపాదనను తెచ్చింది. దీనిని ఎవరూ అంగీకరించరు. డాలర్‌తో ఆటలాడితే 150 శాతం సుంకాలు విధిస్తానని నేను చేసిన హెచ్చరికతో ఇప్పుడు ఆ ప్రతిపాదన గురించి మాట్లాడేందుకు వారు (బ్రిక్స్ దేశాలు) భయపడుతున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను అమలు చేయాలని వారు అనుకుంటే మళ్లీ నా దగ్గరకు వచ్చి సుంకాలు వద్దని అడుక్కోవాల్సి వస్తుంది. ఈ మాట నేను చెప్పిన మరుక్షణమే బ్రిక్స్ అంతమైంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో కాని మరెక్కడైనా కాని అమెరికన్ డాలర్‌ను భర్తీ చేసే అవకాశం బ్రిక్స్‌కు లేదని, ఒకవేళ ఏ దేశమైనా ఆ ప్రయత్నం చేస్తే సుంకాలకు హలో చెప్పి అమెరికాకు గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని స్పష్టంచేశారు. బ్రిక్స్ సభ్య దేశాలలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజి ప్టు, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఈ గ్రూపునకు ఉమ్మడి కరెన్సీ ఏదీ లేనప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధం అనంతరం అనేక పశ్చి మ దేశాల నుంచి రష్యా ఆంక్షలను ఎదుర్కోవడంతో ఈ అంశంపై చర్చలు జోరందుకున్నాయి.
Also Read..
Israel: ఇజ్రాయిల్‌లో ఉగ్రదాడి.. మూడు బస్సుల్లో పేలుళ్లు
Earth’s Hidden Treasure | పర్వతాల కింద హైడ్రోజన్.. శిలాజ ఇంధనాల కొరతకు చెక్!
Toilet Break | బ్రేక్ 2 నిమిషాలే.. టాయిలెట్ వాడకంపై ఉద్యోగులకు టైమ్ స్లాట్లు