Earth’s Hidden Treasure | బెర్లిన్, ఫిబ్రవరి 20: పర్వత శ్రేణుల కింది భాగంలో పెద్దమొత్తంలో పర్యావరణహిత వైట్ హైడ్రోజన్ నిల్వలు ఉన్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న దీనికి భారీ డిమాండ్ ఉంది. నాచురల్ (సహజ) లేదా జియోలాజిక్ హైడ్రోజన్‌గా పిలిచే ఇది పర్వత ప్రాంతాల్లోని భూమి లోపలి పొరల్లో ఉండే అవకాశముందని అధ్యయనంలో తేలింది. ప్రధానంగా పైరినీస్, యూరోపియన్ ఆల్ఫ్స్, హిమాలయ శ్రేణుల్లో వీటి నిల్వలు ఉండవచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జర్మనీలోని హెల్మ్హోల్ట్జ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా, వాతావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్న వైట్ హైడ్రోజన్‌పై కొంతకాలంగా శాస్త్రవేత్తల దృష్టిపడింది. తాజా పరిశోధనలో భాగంగా వైట్ హైడ్రోజన్ తయారయ్యేందుకు అనుకూల పరిస్థితులు ఉండే ప్రాంతాల కోసం భూమి లోపలి పొరల్లోని టెక్టొనిక్ ప్లేట్స్ కదలికలను వారు అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే కంప్యూటర్ నమూనాల ద్వారా ఆయా పర్వత శ్రేణుల్లో వైట్ హైడ్రోజన్ ఉండే ఆస్కారముందని కనుగొన్నారు.
భూమి లోపలి పొరల్లో ఉండే ప్రత్యేకమైన ఇనుప ఖనిజం (మాంటిల్ రాక్)తో నీరు చర్య జరిగినప్పుడు ఈ వైట్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. అయితే, మాంటిల్ రాక్ భూమి ఉపరితలం నుంచి చాలా లోతుల్లో ఉంటుంది. అక్కడ నీటి లభ్యత ఉండదు. భూమి టెక్టొనిక్ ప్లేట్ల్ కదలికలు, ఖండాలు అంతర్భాగంలో పరస్పరం ఢీకొన్నప్పుడు కొన్నిసార్లు ఈ మాంటిల్ రాక్ పైకి వచ్చే ఆస్కారం ఉంటుంది. డ్రిల్లింగ్ ద్వారా వాటిని వెలికితీసి, నీటితో చర్య జరిపితే వైట్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను సెర్పింటైజేషన్ అని అంటారు. ఇప్పుడు ఈ ప్రక్రియపై తాము దృష్టిపెట్టామని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు ఫ్రాంక్ జ్వాన్ స్పష్టం చేశారు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నీరు రసాయన చర్యకు గురైనప్పుడు ఉత్పత్తయ్యే వాయువును వైట్ హైడ్రోజన్ అంటారు. ప్రస్తుతం కమర్షియల్ హైడ్రోజన్‌ను శిలాజ ఇంధనాలను ఉపయోగించి తయారు చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి హాని జరుగుతున్నది. అందువల్ల గ్రీన్ ఫ్యూయల్‌గా పిలుచుకునే దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రత్యేకించి ఏవియేషన్, స్టీల్ తదితర పరిశ్రమల్లో దీనికి డిమాండ్ ఉంది. 1987లో మాలిలో ప్రమాదవశాత్తూ బావిలో కాలుతున్న సిగరెట్ పడటం వల్ల దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ప్రమాద సమయంలో ఆ బావిని మూసివేయగా.. 2011లో తిరిగి తెరిచారు. అప్పటినుంచి అక్కడ వైట్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి స్థానిక గ్రామానికి కావాల్సిన విద్యుత్తును అందిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో గతంలోనే దీన్ని కనుగొన్నారు. అయితే, అది చాలా చిన్న మొత్తంలోనే. ప్రపంచ ఇంధన కొరత తీర్చేంత పెద్దమొత్తంలో వైట్ హైడ్రోజన్ నిల్వల కోసం ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతూనే ఉన్నది.