Toilet Break | బీజింగ్, ఫిబ్రవరి 20: టాయిలెట్ వాడకంపై ఉద్యోగులకు టైమ్ స్లాట్లు కేటాయిస్తూ చైనాకు చెందిన ఓ కంపెనీ జారీచేసిన ఉత్తర్వులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రీ బ్రదర్స్ మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫిబ్రవరి 11 నుంచి ఈ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఉద్యోగులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్లలో రెండు నిమిషాలు మాత్రమే టాయిలెట్‌ను వినియోగించుకోవలసి ఉంటుంది.
చైనాకు చెందిన ప్రాచీన చక్రవర్తి ఒకరు(ఎల్లో ఎంపరర్) చేసిన ఆరోగ్య సూత్రాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు కంపెనీ తెలిపిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పేర్కొంది. అయితే టాయిలెట్‌ను ఎక్కువసార్లు ఉపయోగించాల్సిన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కాస్త వెసులుబాటు కల్పిస్తూ అలాంటి ఉద్యోగులు హెచ్ఆర్ విభాగం వద్ద ప్రత్యేక అనుమతి తీసుకోవాలని, అదనపు సమయం వాడుకున్నందుకు వారి జీతంలో కొంత కోత విధిస్తామని కంపెనీ తెలిపింది.
నిబంధనలు అతిక్రమించిన వారికి 100 యువాన్లు(సుమారు రూ. 1200) జరిమానా ఉంటుందని కంపెనీ హెచ్చరించింది. ఫిబ్రవరి 28 వరకు ప్రయోగాత్మకంగా ఈ నిబంధనలు అమలులో ఉంటాయని, మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఇవి అమలులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. కాగా, ఈ నిబంధనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కార్మిక చట్టాలకు వ్యతిరేకమని చైనా న్యాయవాది చెన్ షిజింగ్ స్పష్టం చేశారు. ప్రజలలో కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.