మానవ అవయవాల్లో గుండె చాలా ప్రధానమైంది. గుండెకు ఏదైనా జబ్బు వస్తే ఆ తర్వాత జీవితం అంతా గాజుబొమ్మలాగే బతకాలి. గుండెకు ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉండాలి. తాజాగా సైంటిస్టులు చేసిన పరిశోధనతో ఈ పరిస్థితి మారనుంది. గుండెను రిపేర్ చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కు చెందిన పరిశోధకులు సింథటిక్ మెసెంజర్ రిబోన్యూక్లియక్ యాసిడ్ (ఎంఆర్ఎన్ఏ) ద్వారా ఒక ఎలుక హృదయంలోకి కొన్ని మ్యుటేట్ అయిన ట్రాన్స్క్రిప్షన్ కారకాలను పంపారు. ఇవి డీఎన్ఏ.. ఆర్ఎన్ఏగా మారే ప్రక్రియను కంట్రోల్ చేసే ప్రొటీన్లు. ఇలా మ్యుటేట్ చేసిన స్టెమిన్, వైఏపీ5ఎస్ఏ కారకాలు కలిసి హృదయంలోని కణాలు వేగంగా రెట్టింపు అవడానికి దోహదపడతాయి.
దీంతో గుండె వేగంగా రిపేర్ అవుతుంది. తాము పంపే ఈ కారకాల వల్ల హృదయం రిపేర్ అయ్యే వేగం చాలా రెట్లు పెరుగుతోందని చెప్పిన శాస్త్రవేత్తలు.. కేవలం 24 గంటల్లోనే 15 రెట్ల వేగాన్ని పరిశీలించినట్లు చెప్పారు. మరో పరిశోధనలో హృదయంలో దెబ్బతిన్న ప్రాంతాన్ని ఈ కారకాలు రిపేర్ చేయడాన్ని కూడా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు.