Cyclone Senyar | మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనం తుపానుగా మారితే దీనికి ‘సెన్యార్’గా నామకరణం చేయనున్నట్లు ఐఎండీ పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఈ పేరును సూచించింది. నవంబర్లో సాధారణంగా బంగాళాఖాతంలో తుపాను కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనంగా మారే అవకశం ఉంది. ఈ అల్పపీడనం క్రమంగా తుపానుగా మారుతోందని విపత్తు నిర్వహణ విభాగం అంచనా వేసింది. తుపాను సమయంలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ఇది సముద్ర కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. మలక్కా జలసంధి కీలక చాలా కీలకమైంది. ఇది అండమాన్ సముద్రం, దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతుంది.
అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. బలమైన గాలులు వీస్తాయని. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. అదే సమయంలో తమిళనాడుతో పాటు పలు దక్షిణాది రాష్ట్రాలు తుపానుతో ప్రభావితమవుతాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంకలో మరో అల్పపీడనం సైతం చురుగ్గా ఉందని.. ఇది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. దాంతో దక్షిణ భారతంలో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. దాంతో తమిళనాడు, ఏపీ, కేరళలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తమిళనాడులోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా టుటికోరిన్ వంటి తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు మునిగిపోయాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు.