ఇస్లామాబాద్, నవంబర్ 26: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు సంచలన వార్తలు వెలువడుతున్నాయి. రావల్పిండిలోని అదియాలా జైలులో ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపివేసినట్లు బుధవారం కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, నిఘా సంస్థ ఐఎస్ఐ సంయుక్తంగా కుట్రకు పాల్పడి ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసినట్లు బలూచిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. అయితే ఈ వార్తలకు ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు. కారాగారం వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన ఇమ్రాన్ ఖాన్ అభిమానుల ఫొటోలు సైతం సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఇమ్రాన్ ఖాన్‌ను బంధించిన జైలులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన సోదరీమణులు, ఇతర కుటుంబ సభ్యులను అధికారులు అనుమతించలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను హతమార్చి ఉంటారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అదియాలా జైలులో పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడైన ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసినట్లు పాక్, అఫ్ఘాన్‌లోని పలు మీడియా సంస్థలు తమ సోషల్ మీడియాలో వార్తలు ప్రచురించాయి.
జుట్టుపట్టుకొని ఈడ్చేశారు
2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో బందీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను గత అనేక నెలలుగా ఆయన కుటుంబ సభ్యులు సహా ఎవరూ చూడలేదు. అప్రకటిత ఆంక్షలు విధించిన పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన మిత్రులు, కుటుంబం, పార్టీ నాయకులు ఎవరూ కలవడానికి అనుమతించలేదు. తమ సోదరుడి మరణంపై వదంతులు వ్యాపించిన నేపథ్యంలో మంగళవారం అదియాలా జైలు వద్దకు ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ పార్టీ కార్యకర్తలతో కలసి చేరుకున్నారు. జైలులో తమ సోదరుడిని కలుసుకోవడానికి అనుమతించని అధికారులు తమపై పోలీసు సిబ్బందితో దౌర్జన్యం చేయించారని, తమను జుట్టుపట్టుకుని ఈడ్చేశారని తెలిపారు. ఇమ్రాన్ మరణవార్తతో రగులుతున్న పాక్
ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అఫ్ఘాన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన వార్తా కథనం పాకిస్థాన్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో యావద్దేశంఉలిక్కిపడింది. ఈ వార్తలను పాక్ అధికారులు ఖండించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇమ్రాన్ హత్యపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అఫ్ఘానిస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ జైలులో తనపై జరిగిన చిత్రహింసల కారణంగా మరణించారు. ఆయన మృతదేహాన్ని కారాగారం నుంచి వెలుపలకు తరలించినట్లు పత్రిక పేర్కొంది. కాగా, ఇమ్రాన్ మరణవార్త విన్న ఆయన ముగ్గురు సోదరీమణులతోపాటు పీటీఐ నేతలు వందలాది మంది జైలుకు సమీపంలో మోహరించారు. జైలు వద్దకు వెళ్లడానికి వారికి అనుమతి నిరాకరించడంతో ఫ్యాక్టరీ చెక్‌పాయింట్ వద్ద భారీ స్థాయిలో నిరసన ప్రారంభమైంది.
ఆ వార్తల్లో నిజంలేదు
అఫ్ఘానిస్థాన్ టైమ్స్ ప్రచురించిన వార్తలను గంటల వ్యవధిలోనే పాకిస్థానీ ప్రభుత్వ అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేశారంటూ ఈ ఏడాది మేలో ప్రచారం చేసిన తరహాలోనే ఇప్పుడు మళ్లీ మోసపూరితంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు పాక్ విదేశాంగ శాఖ ఒక పత్రికా ప్రకటనను సైతం జారీచేసింది. అయితే పాక్ సమాచార ప్రసార శాఖ తర్వాత విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అవి తప్పుడు వార్తలని ఖండించింది.