Adilabad : ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రొఫెసర్ ఖాసీం డిమాండ్ చేశారు. బుధవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో జరిగిన విద్యార్థి యువజన పోరుగర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 6000 మందికి ఉపాధి కల్పించే సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సిమెంటు పరిశ్రమలు ప్రారంభించాలంటూ ప్రధానిని అడగాలని సూచించారు.
గతంలో జిల్లాలో పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సిమెంట్ పరిశ్రమను ప్రారంభిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారని, ఎంపీ, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమను ప్రారంభించడానికి రూ.250 కోట్లు ఖర్చు అవుతున్నాయని, నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల పర్యటన కోసం రూ. 270 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. సీసీఐ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వీడాలన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ బీజేపీఎంపీ, ఎమ్మెల్యేలు సిమెంట్ పరిశ్రమ ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం వేలాదిమందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించడం లేదని తెలిపారు. సాధన కమిటీ పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.