శనివారం 16 జనవరి 2021
International - Nov 27, 2020 , 12:01:16

క్రికెట్ మ్యాచ్‌లో అదానీ మైనింగ్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌

క్రికెట్ మ్యాచ్‌లో అదానీ మైనింగ్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌

సిడ్నీ: ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో భార‌త వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీకి చెందిన కంపెనీకి వ్య‌తిరేకంగా కొంద‌రు నిర‌స‌న తెలిపారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరు ఓవ‌ర్లు ముగిసిన త‌ర్వాత ఇద్ద‌రు నిర‌సన‌కారులు ప్ల‌కార్డులు ప‌ట్టుకొని గ్రౌండ్‌లోకి రావ‌డం గ‌మ‌నార్హం. రెండు నిమిషాల పాటు పిచ్ ద‌గ్గ‌రికి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. ఆ త‌ర్వాత సెక్యూరిటీ వాళ్లు వ‌చ్చి వాళ్ల‌ను గ్రౌండ్ బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. వాళ్లు క్వీన్స్‌ల్యాండ్‌లో వివాదాస్ప‌ద మైనింగ్ ప్రాజెక్ట్‌ను వ్య‌తిరేకిస్తూ.. నో బిలియ‌న్ డాల‌ర్ అదానీ లోన్ అన్న ప్ల‌కార్డులు ప‌ట్టుకున్నారు. స్టేడియంలో మొత్తం 50 మంది నిర‌స‌న‌కారులు ఉన్నారు. కార్మికేల్ కోల్ మైన్ కోసం అదానీకి బిలియ‌న్ డాల‌ర్ల లోన్ ఇవ్వ‌కూడ‌దంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోల్ మైన్‌కు వ్య‌తిరేకంగా చాలా కాలంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. దీని కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో మైనింగ్ ప్రాజెక్ట్ ఆపాల‌న్న డిమాండ్లు పెరుగుతున్నాయి. స్టాప్ అదానీ గ్రూప్ పేరుతో ఈ నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా త‌మ నిర‌స‌న‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ప్ర‌పంచం దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్టాప్‌ అదానీ గ్రూప్‌ ప్రెస్ రిలీజ్ చేసింది. అదానీకి లోన్ ఇవ్వ‌కుండా ఎస్‌బీఐపై ఒత్తిడి తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని స్టాప్ అదానీ అధికార ప్ర‌తినిధి వ‌ర్షా యజ్‌మ‌న్ అన్నారు.