Musk U Turn : టెస్లా (Tesla) కంపెనీ అధినేత, ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) తన రాజకీయ ప్రణాళికల విషయంలో అనూహ్యంగా వెనక్కి తగ్గాడు. అమెరికాలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా తాను ఏర్పాటు చేయాలనుకున్న ‘అమెరికా పార్టీ (America party)’ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. పార్టీ ఏర్పాటు చేస్తే రిపబ్లికన్ పార్టీ (Republican party) లోని ప్రభావవంతమైన నేతలతో, ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD vans) తో తన సంబంధాలు దెబ్బతింటాయని మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ)’ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.
‘మాగా (MAGA)’ రాజకీయ ఉద్యమానికి భవిష్యత్ వారసుడిగా భావిస్తున్న జేడీ వాన్స్‌తో మస్క్ గత కొన్ని వారాలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొన్నది. తాను కొత్త పార్టీని ప్రారంభిస్తే అది వాన్స్‌తో తనకున్న సత్సంబంధాలను దెబ్బతీస్తుందని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2028 అధ్యక్ష ఎన్నికల్లో జేడీ వాన్స్ అధ్యక్షుడిగా పోటీ చేస్తే ఆయనకు మద్దతుగా తన భారీ సంపదలో కొంత భాగాన్ని వెచ్చించేందుకు కూడా మస్క్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
కాగా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్, ఇతర రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా మస్క్ దాదాపు 300 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. అయితే పార్టీ ఏర్పాటు ఆలోచనను మస్క్ పూర్తిగా విరమించుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. గత జూలై నెలలో ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పన్ను తగ్గింపు, వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ‘మీ స్వేచ్ఛను మీకు తిరిగి ఇవ్వడానికి ఈ రోజు ‘అమెరికా పార్టీ’ ఏర్పడింది’ అని సంచలన ప్రకటన చేశారు. అవినీతి, దుబారాతో దేశాన్ని దివాలా తీయించే విషయంలో మనం ఏక పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో కాదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2026 మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కూడా అప్పట్లో మస్క్ స్పష్టంచేశారు. కానీ తాజా పరిణామాలతో ఆయన తన ప్రాధాన్యాలను మార్చుకుని వ్యాపారాలపై దృష్టి సారించినట్లు అనిపిస్తోంది.