కరీంనగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలకుల ముందుచూపు, తీసుకునే మంచి నిర్ణయాలపైనే ఆ ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నది చాణక్యుడి మాట. ఇందుకు కేసీఆర్ ఆలోచనా విధానం నుంచి పురుడుపోసుకున్న ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం’ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. నాడు ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుపొందిన శ్రీరాంసాగర్ క్రమేపీ వట్టిపోవడం, ఈ ప్రాజెక్టునే ఆధారంగా చేసుకొని కట్టిన వరద కాలువ బోసిపోవడం, ఫలితంగా వ్యవసాయ రంగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం, ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయని సమైక్య పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతుల బతుకే దుర్భరంగా మారింది. ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వట్టిపోయిన ఎస్సారెస్పీకి జీవం పోయాలని, వరదకాలువను కాళేశ్వరం జలాల ఎత్తిపోతలతో రిజర్వాయర్‌గా మార్చాలని కార్యాచరణ రూపొందించి అమలు చేశారు. ఇప్పుడు ఆయన దూరదృష్టే వరదకాలువకు జీవనాధారమైంది. అన్నదాతలకు జీవనాడిగా మారింది. భూగర్భజలాలు పె రిగేందుకు వేదికైంది. మండుటెండల్లోనూ చె రువులు మత్తళ్లు దూకేందుకు ఆధారమైంది. నాడు కేవలం వరదకు మాత్రమే పరిమితమై, నేడు బహుళ ప్రయోజనాలకు వేదికైన వరదకాలువ వినియోగాన్ని చూస్తే పాలకుడి దూరదృష్టి అర్థమవుతుంది.
కాంగ్రెస్ పాలనలో వరద కాలువకు 1991 లో ప్రధాని పీవీ నర్సింహారావు శంకుస్థాపన చేశారు. 22వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 122 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ కాలువ ద్వారా ఎస్సారెస్పీ నుంచి దిగువకు 20 టీంఎసీల నీటిని తరలించి, 2.20 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో కాలు వ తవ్వడానికే 19 ఏండ్లు పట్టింది. 1991లో పనులు మొదలు పెడితే 2010లో ప్రారంభానికి నోచుకున్నది.
అప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ ఎగువన బాబ్లీ వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టడంతో ఎస్సారెస్పీకి నీరు రావడం గగనమైం ది. దీంతో ఉత్తర తెలంగాణ వర ప్రదాయని గా ముద్రపడిన శ్రీరాంసాగర్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రాజెక్టుకు నీళ్లు రాక వరదకాలువ మైదానంలా మారి చాలా గ్రామాల పరిధిలో క్రికెట్, ఇతర ఆటలకు వేదికైంది.
ఎస్సారెస్పీలో నీళ్లు లేక ఎడారిగా మారిన వరదకాలువను ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచన నాటి సమైక్య పాలకులు ఏనాడూ చేయలేదు. ప్రత్యామ్నాయ ప్రణాళికలపై దృష్టిపెట్టలేదు. ఎస్సారెస్పీకి తగినంత నీరు రాకపోవడం.. పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఒకానొక దశలో వరదకాలువ మొత్తం వట్టిపోయింది. అయినా దానిని గత పాలకులు గాలికి వదిలేశారే తప్ప ఇతర మార్గాల ద్వారా వినియోగంలోకి తేలేదు. రైతులకు సాగునీరు అందించేందుకు కనీస ఆలోచనలు కూడా చేయలేదు.
తెలంగాణ రైతుల కష్టాలు తెలిసిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమైక్య పాలకులకు భిన్నంగా ఆలోచించారు. వరదకాలువను కేవలం వరదకు పరిమితం చేయకుండా 122 కిలోమీటర్ల పొడవునా రిజర్వాయర్‌గా మార్చాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా ఎస్సారెస్పీ పునర్జీవం పేరిట వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఎస్సారెస్పీ ఎండిపోయినా, వరదకాలువకు నీరు రాకపోయినా ప్రత్యామ్నాయ మార్గమైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎగువకు ఎత్తిపోసి నింపాలని నిర్ణయించారు. వరదకాలువను రిజర్వాయర్‌గా మార్చి పంటలకు సాగునీరు ఇచ్చి రైతుల కష్టాలను రూపుమాపేందుకు పునరుజ్జీవ పథకానికి రూ.1999.56 కోట్లతో 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద శంకుస్థాపన చేశారు. అనతి కాలంలోనే పనులు పూర్తిచేసి శ్రీరాంసాగర్ జీరో పాయింట్ వరకు నీటిని ఎత్తిపోసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.
వరదకాలువ 15వ కిలోమీటర్ వద్ద నిరుడు అక్టోబర్ 9న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ పరిధిలో గండిపడింది. నేటికీ దానిని పూడ్చే నాథుడే లేడు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 38 టీఎంసీల నీళ్లున్నాయి. అయినా వరదకాలువకు గండిపడటంతో దిగువకు నీరివ్వలేని దుస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తి చేసిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకమే రైతుల పాలిట వరంలా మారింది. ఈ ఒక్క సీజన్లో దాదా పు మూడు టీఎంసీల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసి వరదకాలువ నింపారు.
సమైక్య పాలనలో ఎస్సారెస్పీ వట్టిపోయి వరదకాలువకు నీళ్లివ్వలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు 38 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలో ఉన్నా వరదకాలువకు గండి పడటం వల్ల ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. ఒక వేళ కేసీఆర్ కూడా సమైక్య పాలకుల మాదిరిగానే ఆలోచించి ఉంటే.. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పురుడు పోసుకునేదా? కాళేశ్వరం జలాలను వరదకాలువ ద్వారా ఎగువకు ఎత్తిపోసి ఎస్సారెస్పీని నింపేందుకు శ్రీకారం చుట్టకపోతే నేడు ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల రైతుల పరిస్థితి ఏమిటి? వరదకాలువే ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతుల జీవితాలు ఏమయ్యేవి? 122 కిలోమీటర్ల పొడవునా భూగర్భజలాలు పడిపోయి ఎడారిగా మారేది కాదా? అంతెందుకు వరదకాలువ పొడవునా 34కు పైగా ఏర్పాటు చేసిన తూములద్వారా 80కిపైగా చెరువులు నింపడం వల్ల ప్రస్తుతం మండుటెండల్లోనూ అవి మత్తళ్లు దూకుతున్నాయి కదా? కేసీఆర్ పునరుజ్జీవ పథకానికి నడుంబిగించకుంటే ఇవ్వన్నీ సాధ్యమయ్యేవా? అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ దూరదృష్టి వల్ల నేడు వరదకాలువ బహుళ ప్రయోజనకారిగా మారి ప్రజలకు ఫలితాలు ఇస్తున్నది నిజమా? కాదా? ఈ ప్రశ్నలకు ‘కాళేశ్వరం నిష్ప్రయోజనం’ అని విమర్శిస్తున్న పాలకులే సమాధానం చెప్పాలి.
ఇప్పుడు వరదకాలువ రైతుల పాలిట జీవనాడిగా మారింది. ఈ సీజన్లో కాంగ్రెస్ ప్రభు త్వం రెండుసార్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దాదాపు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. దీంతో దాదాపు 88 కిలోమీటర్ల పాడవున వరదకాలువ రిజర్వాయర్లా కనిపిస్తున్నది. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల రైతులకు ప్రయోజనకరంగా మారింది. నాడు కేసీఆర్ తీసుకున్న అనేకచర్యలు ఫలితాలిస్తున్నాయి. వరదకాలువ పొడువునా ఆనాడు 16 చోట్ల అశాస్త్రీయంగా 16 తూములు ఏర్పాటు చేస్తే.. వాటిని సరిచేయడంతో పాటు ఆ సంఖ్యను 34కు పెంచి దాదాపు 80 చెరువులు నింపేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా మండుటెండల్లోనూ ఆ చెరువులు మత్తడి దూకే పరిస్థితి ఏర్పడింది. వరదకాలువ పొడవునా ఏర్పాటు చే సిన మూడు పంపుహౌస్‌ల పరిధిలో ఎక్కడికక్కడ రిజర్వాయర్లను తలపించేలా గేట్లు బిగించడంతో 0 నుంచి 122వ కిలోమీటర్ వరకు వరదకాలువ ప్రస్తుతం నాలుగు రిజర్వాయర్లుగా కనిపిస్తున్నది. కండ్లముందు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలు కనిపిస్తున్నా.. లక్షలాది ఎకరాలకు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నా ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఎస్సారెస్పీ పునరుజ్జీవమే చెంప పెట్టులాంటిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వట్టిపోయిందన్న వరదకాలువ తన స్వరూపాన్నే మార్చుకొని కాళేశ్వరం జలాలను తన ఒడిలో నింపుకొని, నేడు లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నదంటే దానివెనుక కేసీఆర్ స్వప్నం, కష్టం, దూరదృష్టి దాగున్నదనేది కఠోర సత్యం.
మా బూరుగుపల్లి రైతుల్లో 70 శాతం మంది ఊరి చెరువుపై ఆధారపడి పం టలు పండిస్తరు. మా ఊరి పక్క నుంచే వరద కాలువ వెళ్తు న్నా నీరు లేక ఎడారిని తలపించేది. ఇటు కాలువ, అటు బోర్లలో నీళ్లు లేక పంటలను కాపాడుకోవడం కష్టమయ్యేది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి, 2018లో బూరుగుపల్లి వద్ద వరద కాలువకు తూము ఏర్పాటు చేసిండు. గాయత్రీ పంపుహౌస్ నుంచి నీళ్లు విడిచినప్పుడల్లా తూము ద్వారా చెరువులోకి నీళ్లు వస్తయి. అప్పటి నుంచి చెరువు ఎండిపోయింది లేదు.
నాటి కాంగ్రెస్ సర్కార్ హయాంలో సాగునీటి కోసం వరద కాలువలో గుంతలు తవ్వినం. వేలాది రూపాయలు ఖర్చు చేసి కిలోమీటర్ల మేర పైపులైన్ వేసుకొని పంటలు కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడ్డం. మా ఊరి నాయకులు రూ.3 లక్షలు ఖర్చు చేసి ట్రాక్టర్ ద్వారా వరదకాలువ నుంచి చెరువులోకి నీటిని ఎత్తిపోసిన్రు. నీటిని ఎత్తి పోయడానికి అనుమతిలేదని అధికారులు 13 మందిపై కేసులు పెట్టిండ్రు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో ఇక్కడి రైతుల జీవితాల్లో మార్పు వచ్చింది.
కేసీఆర్ వరదకాలువ నింపాలన్న ఆలోచన చేయడం వల్లే ఈరోజు మాకు నీళ్లు వస్తున్నయ్. వరదకాలువకు తూము ఏర్పాటు చేసిన తర్వాత మా ఊరిలో కరువన్నదే లేకుండా పోయింది. మాకు ఊరిలో మూడెకరాల భూమి ఉన్నది. కేసీఆర్ రాకముందు వరదకాలువ ఉన్నా నీళ్లు లేక ఎడారిలా ఉండేది. పంటలు కాపాడుకోడానికి ఆరు బోర్లు వేసినం. చుక్కా నీరు పడక అప్పులు మీద పడ్డయ్. రైతులకు నీళ్లివ్వాలన్న సోయి ఆనాటి కాంగ్రెస్ పాలకులకు లేకుండె. కేసీఆర్ ఆలోచన పంటలు కళకళలాడుతున్నయి.