Mumbai monorail : మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో సాంకేతిక సమస్య కారణంగా ఎత్తయిన ట్రాక్‌పై నిలిచిపోయిన మోనోరైలు (Mono rail) లో 582 మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారందరినీ అధికారులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నా రెస్క్యూ సిబ్బంది (Rescue staff) ఏకంగా నాలుగు గంటలపాటు శ్రమించి వారందరినీ రక్షించారు. దాంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే రైలులోని 582 మంది ప్రయాణికులు నాలుగు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం సాయంత్రం 6.15 గంటల సమయంలో ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న మోనోరైలు భక్తిపార్క్ – చెంబూర్ స్టేషన్ల మధ్య ఒక్కసారిగా ఆగిపోయింది. సాంకేతిక సమస్యవల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో రైలు కదలలేదు.
సమాచారం అందుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కై ల్యాడర్ల సహాయంతో నాలుగు గంటలపాటు శ్రమించి, రైలులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనలో ఊపిరాడక అస్వస్థతకు గురైన 12 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
రైలు అరగంట ఆలస్యంగా రావడంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిందని, తాను సాయంత్రం 5.30 గంటల నుంచి రైలులోనే ఉన్నానని, రైలు ఆగిపోయిన ఒక గంట తర్వాత సహాయక చర్యలు మొదలయ్యాయని ప్రమాదం నుంచి బయటపడిన ఒక ప్రయాణికుడు తెలిపారు. కాగా ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రయాణికుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యమని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎక్స్ ద్వారా భరోసా ఇచ్చారు.
ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. భారీ వర్షాలవల్ల హార్బర్ లైన్ మూసివేయడంతో ప్రయాణికులంతా మోనోరైలును ఆశ్రయించారని, రద్దీ పెరగడంతో విద్యుత్ వ్యవస్థపై భారం పడి లోపం తలెత్తిందని ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.