Current Wires | హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రామంతపూర్‌లో ఐదుగురు, బండ్లగూడలో ఇద్దరు, బాగ్‌అంబర్‌పేటలో ఒకరు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో మరో ఇద్దరు, కామారెడ్డి జిల్లా ఆరెపల్లిలో ఒకరు.. ఇలా వరుస విద్యుదాఘాత మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక విషాద ఘటనను మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంటున్నది. మొత్తంగా విద్యుత్తు తీగలను తలచుకుంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అన్నిచోట్లా కరెంటు తీగలే కాటేయడం గమనార్హం. హైదరాబాద్ రామంతాపూర్‌లో శ్రీకృష్ణుడి విగ్రహ ఊరేగింపులో విద్యుత్తు తీగలు తాకడంతో ఐదుగురు వ్యక్తులు ప్రాణా లు కోల్పోయారు.
చిన్నకోడూరు మండలంలో తండ్రీకొడుకు ప్రాణాలిడిచారు. ఒక్కరోజులోనే ఏడుగురు చనిపోయారు. మరుసటి రోజే మరో నలుగురిని కరెంట్ బలి తీసుకున్నది. నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు. బాగ్‌అంబర్‌పేటలో వినాయక మండపానికి పైకప్పు వేస్తుండగా హైటెన్షన్ వైరు తగిలి మరో యువకుడు చనిపోయాడు. వినాయక విగ్రహాన్ని తీసుకొస్తుండగా 11 కేవీ విద్యుత్తు వైర్లు విగ్రహానికి అమర్చిన ఇనుప పైపులకు తగలడంతో సిరిసిల్ల పట్టణానికి చెందిన కొమ్ము లక్ష్మీనారాయణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఏటా 300 మంది మృత్యువాత
విద్యుత్తు షాక్‌లతో ఏటా 300 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలు ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలోనే అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే 217 విద్యుత్తు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో కేవలం 113 కేసులకు మాత్రమే రూ.5.85 కోట్ల ఎక్స్‌గ్రేషియా రూపంలో ఉత్తర తెలంగాణ డిస్కం చెల్లిచింది. జంతువులకు సంబంధించి 554 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 239 కేసులకే ఉత్తర తెలంగాణ డిస్కం రూ.1.18 కోట్ల పరిహారాన్ని చెల్లించింది. డిస్కం అధికారులు ఘటన జరినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. పాఠాలు నేర్వడంలేదు. దిద్దుబాటు చర్యలూ చేపట్టడంలేదు. మియాపూర్‌లో విద్యుదాఘాతంతో చిన్నారికి కాలిన గాయాలయ్యాయి. డిస్కం అధికారులు చెల్లించే పరిహారాన్ని తల్లిదండ్రులు నిరాకరించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు.
విద్యుత్తు స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విద్యుత్తు స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్తు శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కేబుళ్లను తొలగించాలని ఆపరేటర్లను హెచ్చరించినా వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణానికి ముప్పు ఏర్పడిందని తెలిపారు. అనుమతులు లేకుండా తీసుకున్న కనెక్షన్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. డీపీఆర్‌పై సుధీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, ఎస్పీపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఉత్తర డిస్కం సీఎండీ వరుణ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన ఉదంతాలు
రామంతాపూర్ ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్
రామంతాపూర్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ షాక్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన విషాదకరమని ఆవేదన వ్యక్తంచేసింది. ఘటనకు గల కారణాలు, అధికారుల నిర్లక్ష్యం, తక్షణ పరిషార చర్యలు, బాధితుల కుటుంబాలకు పరిహారం వంటి చర్యలపై మానవ హక్కుల కమిషన్ వివరణ కోరింది. అక్కడ తీసుకున్న భద్రతాపరమైన చర్యలపై సెప్టెంబర్ 22లోపు సమగ్రమైన నివేదిక సమర్పించాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీకి ఆదేశాలను జారీచేసింది.