SC Bifurcation | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం కాగితాలకే పరిమితమైంది. ఈ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి సరిగ్గా ఏడాది గడిచింది. దానిపై నిరుడు ఏప్రిలోనే గెజిట్ వచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఎస్సీ వర్గీకరణ చట్టం ఫలాలను పొందేందుకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సర్కార్ ఎస్సీ వర్గీకరణను పాటించలేదు. దీనిపై దళిత వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 59 షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయి. ఆ వర్గాలవారికి రాజ్యాంగబద్ధంగా గంపగుత్తగా 15% రిజర్వేషన్లు అమలవుతూ వచ్చాయి. దీంతో రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగలు, ఇతర అత్యంత వెనకబడిన షెడ్యూల్డ్ కులాలవారు దీర్ఘకాలం నుంచి కొట్లాడటంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉన్నదని పేర్కొంటూ ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఆగస్టులో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.
ఆ తీర్పు మేరకు వెంటనే ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అనంతరం ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సుప్రీంతీర్పును కూలంకషంగా అధ్యయనం చేయడంతోపాటు రిజర్వేషన్ల అమలు కోసం సిఫారసులు చేసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ కమిషన్ సమర్పించిన నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత ప్రభుత్వం తెలంగాణ షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం-2025 పేరిట నిరుడు మార్చి18న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఆ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నిరుడు ఏప్రిల్‌లో గెజిట్ జారీ అయ్యింది.
ఏడాదైనా అమలుకాని వైనం
నూతన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను వారి జనాభా, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా 3 గ్రూపులుగా విభజించింది. 15% రిజర్వేషన్‌ను కూడా విభజించింది. గ్రూప్-ఏలో చేర్చిన 15 ఉపకులాల వారికి 1%, గ్రూప్-బీలోని మాదిగలు సహా 18 కులాలవారికి 9%, గ్రూప్-సీలోని మాలలు సహా 26 కులాలవారికి 5% రిజర్వేషన్లు కల్పించింది. సవరించిన ఈ రిజర్వేషన్లు వెంటనే అమలులోకి వస్తాయని గెజిట్‌లో ప్రకటించింది. విద్యా, ఉద్యోగ నియామకాలతోపాటు స్థానిక సంస్థల్లో సవరించిన రిజర్వేషన్లను మాత్రమే పాటించాలని గెజిట్‌లో స్పష్టం చేసిన ప్రభుత్వం.. అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలతోపాటు ప్రభుత్వ సర్వీస్ నియమకాలకు అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్లను కూడా సవరిస్తూ వేర్వేరుగా ఉత్వర్వులు విడుదల చేసింది. ఇకపై ఆయా గ్రూపులు, కులాలవారికి ప్రాధాన్య క్రమంలో నూతన చట్టం ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికింది. ఈ తంతు జరిగి ఏడాది గడచినా వర్గీకరణ చట్టం ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
59లో కేవలం 18 కులాలకే సర్టిఫికెట్లు
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల జాబితాలో గుర్తించిన 59 కులాల్లో మాల, మాదిగ మినహా 57 అత్యంత వెనకబడిన కులాలు ఉన్నాయి. ఎస్సీలకు తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల కమ్యూనిటీ సర్టిఫికెట్ చట్టం ప్రకారం కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. కానీ, ఆ చట్టం ప్రకారం వివిధ కులాలకు వివిధ స్థాయి అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలనే నిబంధనలు విధించారు. స్వరాష్ట్ర ఏర్పాటు వరకు తాహసీల్దార్ 12 ఎస్సీ కులాలకు చెందినవారికి మాత్రమే కుల ధ్రువీకరణ పత్రాలను జారీచేసే అధికారం కల్పించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం జీవో 11 ద్వారా మరో 6 ఎస్సీ కులాలవారికి తహసీల్దార్ కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా నిబంధనలను మార్చింది. దీంతో ప్రస్తుతం మొత్తంగా 18 ఎస్సీ కులాలవారికి మాత్రమే తహసీల్దార్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. ఎస్సీల జాబితాలోని ‘బరికి’ కులంవారికి కలెక్టర్, మిగిలిన 40 కులాలవారికి ఆర్డీవో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాల్సి ఉన్నది. కానీ, అధికారుల ఉదాసీనత మూలంగా 40 ఎస్సీ కులాలవారు ధ్రువీకరణ పత్రాలు పొందలేక రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలకు దూరమవుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో అమలు చేయలె
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని వర్తింప జేయడందు. ఆ చట్టం అమల్లోకి వచ్చాక కనీసం ఒక్క నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. నియామకాలను చేపట్టలేదు. గతంలో జారీచేసిన నోటిఫికేషన్లకు ఆ చట్టాన్ని మినహాయించారు. విద్యాసంస్థల అడ్మిషన్లలోనూ వర్గీకరణ చట్టాన్ని పాటించడం లేదు. ఇటీవల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లోనూ గతంలో మాదిరిగా ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేసిందే కొత్త వర్గీకరణ చట్టాన్ని పాటించలేదు. 2011 నాటి జనాభా లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సీట్లలో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడం, ఆయా గ్రూపులవారీగా సీట్లను కేటాయించకపోవడం రేవంత్‌రెడ్డి సర్కార్ దుర్నీతికి అద్దం పడుతున్నది. దీంతో ప్రభుత్వం ఇకనైనా వర్గీకరణ చట్టాన్ని అమలు చేయాలని, ఎస్సీల్లోని అన్ని వర్గాలవారికి కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని దళితవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.