Shubhanshu Shukla | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయోగించిన స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ (Falcon-9 rocket) నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా అంతరిక్షం (International Space Station) నుంచి శుభాన్షు ఓ సందేశం పంపారు. ఈ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను జీరో గ్రావరిరటీకి అలవాటు పడుతున్నట్లు చెప్పారు.
‘అందరికీ నమస్కారం.. తోటి వ్యోమగాములతో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. వావ్.. ఇది ఎంత అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని నిజంగా ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకునే చిన్నారిలా.. జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నాను. ఎలా కదలాలో, నన్ను నేను ఎలా నియంత్రించుకోవా, ఎలా తినాలో తెలుసుకుంటున్నా’ అంటూ శుభాన్షు ఈ ప్రయాణంలో తన అనుభవాలను సందేశం ద్వారా పంచుకున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములను పంపించి అక్కడ పలు ప్రయోగాలు చేయించడానికి అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’.. నాసా, స్పేస్ఎక్స్, ఇస్రో, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీర్ఘకాలంపాటు చేపట్టే రోదసి యాత్రల్లో వ్యోమగాముల శారీరక మార్పులపై ప్రధానంగా ఈ మిషన్‌లో రిసెర్చ్ చేయనున్నారు. రోదసి యాత్రల సమయంలో కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై కలిగే ప్రభావం.. ఇలా 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలను చేయనున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగానికి భారత వ్యోమగామి శుభాన్షు పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.
41 ఏండ్ల తర్వాత..
1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే.
Also Read..
Operation Sindhu | కొనసాగుతున్న ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి 3,426 మంది తరలింపు
Rajnath Singh | పహల్గాం ప్రస్తావన లేకుండానే ఎస్సీవో పత్రం.. సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ మా హక్కు.. చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్