శుక్రవారం 05 జూన్ 2020
International - May 08, 2020 , 02:46:12

భారత్‌, పాక్‌లకు ముప్పు ఎక్కువే

భారత్‌, పాక్‌లకు ముప్పు ఎక్కువే

  • నల్లజాతీయులకూ వైరస్‌ ప్రమాదం పొంచి ఉంది
  • బ్రిటిష్‌ గణాంకాల కార్యాలయం వెల్లడి

లండన్‌: పాశ్చాత్య దేశాల్లోని శ్వేత జాతీయులతో పోలిస్తే భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో నివసిస్తున్న ప్రజలు, నల్లజాతీయులే కరోనా కారణంగా ఎక్కువగా మరణించే అవకాశం ఉన్నదని బ్రిటిష్‌ గణాంకాల కార్యాలయం (ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌-వోఎన్‌ఎస్‌) అంచనా వేసింది. వేర్వేరు జాతి సమూహాలపై వైరస్‌ ప్రభావం వేర్వేరుగా ఉన్నట్టు వెల్లడించింది. ఆర్థిక-సామాజిక పరిస్థితులు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మోడల్స్‌ను రూపొందించినట్టు పేర్కొంది. వివిధ వయస్సుల ప్రజలు, లింగం, జాతులపై వైరస్‌ ముప్పు వేర్వేరుగా ఉన్నదని వివరించింది. తెల్లజాతి పురుషులతో పోలిస్తే నల్లజాతి పురుషులు 4.2 రెట్లు ఎక్కువగా వైరస్‌ కారణంగా మరణించవచ్చని, తెల్లజాతి మహిళలతో పోలిస్తే నల్లజాతి మహిళలు 4.3 రెట్లు ఎక్కువగా వైరస్‌ కారణంగా మరణించవచ్చని పేర్కొంది. ఆర్థికం, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో సర్దుబాట్లను చేయని సందర్భంలో ఈ మోడల్‌ను వెల్లడించింది. సర్దుబాట్లను చేసిన మోడల్‌ ప్రకారం.. తెల్లజాతి వ్యక్తులతో పోలిస్తే నల్లజాతి వ్యక్తులు 1.9 రెట్లు ఎక్కువగా మరణించవచ్చని చెప్పింది. చైనీయులు, ఇతర మిశ్రమ జాతి మూలాల సమూహాలు  ఇలాంటి ముప్పునే ఎదుర్కోనున్నట్టు హెచ్చరించింది. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో వైరస్‌ జన్యుక్రమాల అధ్యయనం కీలకపాత్ర పోషించవచ్చని అభిప్రాయపడింది. తగిన వైద్య సదుపాయాలు లేక ఆఫ్రికన్‌ అమెరికన్లు వైరస్‌ వల్ల అధికంగా మరణించవచ్చని ఓ అమెరికా సంస్థ నివేదిక పేర్కొంది.


logo