e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జిందగీ రాజాపేటలో.. రాగాల కోట!

రాజాపేటలో.. రాగాల కోట!

రాజాపేటలో.. రాగాల కోట!

టీచర్‌ పాఠాలు చెప్తుంటే.. సౌమ్య పాటలు అప్పజెప్పేది. అందరూ వింతగా చూసేటోళ్లు. ఇంటికొచ్చి నాన్నతో చెప్తే.. ‘రెండో తరగతిలో ఉండి పదో తరగతిలో చేసే పనులుచేస్తే వింతగా చూడరా మరి?’ అని నవ్వుకుంటూ అన్నడు. ఏండ్లు గడిచినయి. వింతగా చూసినవాళ్లే, తర్వాత ‘సౌమ్య ది గ్రేట్‌’ అన్నరు. ఆ గ్యాప్‌లో ఏం జరిగింది? సౌమ్య జానపదాన్నే ఎందుకు ఎంచుకున్నది?

పేదరికంలో పుట్టి, పెరిగిన సౌమ్య చిన్నప్పుడే పాటకు సోపతైంది. తెలంగాణ ఉద్యమ వేదికలెక్కి ధూమ్‌ధామ్‌ అంటూ ఆడిపాడింది. పెద్దలతో గొంతు కలిపి ‘ఇస్తననీ చెప్పుడేంది తెలంగాణ.. ఇగో అగో అనుడేందీ తెలంగాణ’ అంటూ వీరతెలంగాణ పాటల తూటాలను సంధించింది. చారిత్రక రాజాపేట సంస్థానంలో వికసించి పల్లె పదాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న చెక్క సౌమ్య పాట ప్రస్థానం ఆమె మాటల్లో..

- Advertisement -

మాది యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట. గొప్ప చరిత్రగల్ల ఊరు. రాజాపేట సంస్థానం అంటే తెలవని వారుండరు. ‘రాజా రాయన్న’ ఈ సంస్థానాన్ని పాలించాడని పెద్దోళ్లు చెప్తే విన్నం. ఆనాటి కోటలు, అద్దాల మేడలు ఇప్పటిగ్గూడా ఉన్నయి. ఒక రకంగా నాకు జానపద సంస్కృతి అబ్బడానికి ఇవి కూడా ఓ కారణమే. ఊరి గొప్పదనం నాలో కొత్త ఆలోచనల్ని పుట్టిచ్చింది. కళలపై దృష్టి మళ్లేలా చేసింది. పల్లె జీవన విధానంలో భాగమైన జానపదానికి దగ్గరయ్యేటట్లు చేసింది. ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులతోనే నేను సర్వం నేర్చుకున్నా. మా అమ్మానాయిన పేదోళ్లే అయినా, మంచిగా చూసుకున్నరు. నా పాటల ప్రయాణానికి మార్గదర్శులు వాళ్లే.

ఆ బాటల నడుస్తున్న

నాయిన పేరు దశరథ. అమ్మ పద్మ. మేం ముగ్గురం ఆడపిల్లలం. మా నాయినమ్మ పేరు ఉషమ్మ. అప్పట్లో బాగా పాటలు పాడేదంట. బతుకమ్మ పాటలు, కోలాటం పాటలు, సువ్వి పాటలకు పెట్టింది పేరని వాళ్లూ వీళ్లూ చెప్తుండేది. నాకు కూడా కొన్ని పాటలు వినిపించింది. మంచిమంచి పాటలు తన దగ్గర నేర్చుకున్నా. నాకు ఇంత పేరు రావడంలో నాయినమ్మ, అమ్మమ్మ దగ్గర సేకరించిన పాటలు ఉపయోగపడ్డయి. నాయినమ్మ నుంచి జానపదాలను బాబాయి వెంకటేశ్‌ వారసత్వంగా తీసుకున్నడు. ప్రజానాట్యమండలిలో కూడా పనిచేసిండు. ఆయన నుంచి పాటల ఆస్తిని నేను తీసుకున్నా. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కాపాడేందుకు మంచి పాటలను ఎంచుకుంటున్నా. రెండో తరగతిలోనే నాకు పాట అలవాటైంది. టీచర్‌ పాఠాలు చెప్తే, నేను పాటలు అప్పజెప్పేదాన్ని.

నా పేరు రాయించిండ్రు

నా నోరు ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు. ఊకే పాటలను ఇమిటేట్‌ చేసేదాన్ని. ఎవరైనా ఇంటికొచ్చినోళ్లు ‘ఏం పద్మమ్మా! మీ చిన్న బిడ్డె నోరు ఖాళీగా ఉండదా? ఏదో ఒకటి గుణుగుకుంట కనిపిస్తది?’ అనేటోళ్లు. ‘గుణుగుడు కాదు. పాటలు ప్రాక్టీస్‌ చేస్తది. పాటలంటే ఇష్టం. ఒకరోజు తినకుండయినా ఉంటదేమోగనీ పాడకుండా ఉండదు’ అంటుండె. అట్లా చిన్నప్పటి సంది నన్ను అమ్మానాయిన వెనకేసుకొని వచ్చిండ్రేగాని, ఏనాడూ ‘ఈ పాటలేంది?’ అనలేదు. వాళ్లూవీళ్లూ అంటుండ్రని బాధపడలేదు. అప్పుడు నేను రెండో తరగతి. స్కూల్లో ఏదో పాటలు పోటీలు పెట్టిండ్రు. అందరూ పేర్లు రాపిస్తుంటే, మా అక్కలు నా పేరు రాపించిండ్రంట. ఇంటికొచ్చినంక విషయం చెప్పిండ్రు. నాకు పానం జల్లుమన్నది. ‘ఏదో లోపటలోపటైతే మస్తు పాడుకుంటంగనీ స్టేజీమీద అంటే కష్టమే కదా’ అనిపించింది. కానీ అక్కలు నచ్చజెప్పగా, తొలిసారి స్కూల్లో పాట పాడిన. టీచర్లు, తోటి విద్యార్థులు మెచ్చుకున్నరు.

బాలాజీ సార్‌ ప్రోత్సాహం

బాలాజీ సార్‌.. ప్రెసిడెన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ కరస్పాండెంట్‌. నా పేదరికాన్ని, ప్రతిభను అర్థం చేసుకుని, వాళ్ల స్కూళ్లో ఆరో తరగతి నుంచి టెన్త్‌ వరకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించిండ్రు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తీసుకెళ్లి, పాటలు అద్భుతంగా పాడతానని అందరికీ గొప్పగా పరిచయం చేస్తుండె. అట్లా ఒక స్కూల్‌ వార్షికోత్సవంలో తొలిసారిగా లీడ్‌ పాట పాడిన. అది మధుప్రియ పాట.. ‘ఆడపిల్ల ఆడపిల్లా ఆడాపిల్లనటా.. నేను పాడూ పిల్లనట’. ఆ ఆదరణ చూస్తే సంబురమనిపించింది. ఉద్యమ ఆందోళనల్లో పాటల తూటాలను సంధించి చిన్నతనంలోనే తెలంగాణ సోయిని ప్రజలకు తెలిపిన.

డబ్బే ప్రపంచం కాదు

తెలంగాణ వచ్చినంక అమ్మకు వీఆర్‌ఏ ఉద్యోగం వచ్చింది. అప్పుడు జరంత ఊపిరి పీల్చుకున్నం. అదృష్టంకొద్దీ అమ్మ వీఆర్వోగా ప్రమోట్‌ అయ్యింది. అంతకుముందు కనీసం పలకరించనోళ్లు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేసిండ్రు. మనం వాళ్లలెక్క ఉంటే బాగుండదు కదా అని, అందరితో మామూలుగానే ఉన్నం. కానీ లోపల బాధ అట్లనే ఉండేది. చేస్తే సాయం చేయాలె. లేకపోతే చప్పుడుకాకుండా ఉండాలె. మా పేదరికం మీద చాలామంది కామెంట్లు చేసేటోళ్లు. డబ్బులది ఏముంది? ఇయ్యాల మన దగ్గర ఉంటయ్‌. రేపు ఇంకొకరి దగ్గర ఉంటయ్‌. పైసలే ప్రపంచం కాదు కదా? ‘నా పాటలు జనాల్లో ఉన్నయ్‌. తర్వాత నేనేం స్టెప్‌ తీసుకోవాలె’ అని ఆలోచిస్తున్న క్రమంలో డిజిటల్‌ మీడియా ఒక్కటే మార్గం అని గ్రహించిన. ఇంటర్‌ ఫస్టియర్‌ నుంచి యూట్యూబ్‌లో అవకాశాల కోసం తిరిగినా. కానీ ఎవరూ ఇవ్వలేదు.

చరణన్న అవకాశమిచ్చిండు

నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నా. గతేడాది ఒక యూట్యూబ్‌ చానెల్‌ను సంప్రదించి ‘నా దగ్గర ఒక మంచి పాట ఉంది. అవకాశం ఇస్తరా?’ అని అడిగితే ‘ఓకే’ అన్నరు. అట్లా ఎస్‌ఎస్‌ ఆడియోస్‌ పాట ద్వారా నా యూట్యూబ్‌ జర్నీ స్టార్ట్‌ అయింది. ‘కోలు కోలుకోలు కోలో నా సామీ.. కొమ్మలిద్దరు మంచి జోడూ’ అనే పాట అది. ఈ పాటను నాయినమ్మ దగ్గర సేకరించి పెట్టుకున్నా. ‘రావి సెట్టెక్కుతాడు.. రాగాలు తీస్తాడు’ ఆనే పాట మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ పాట పాడటానికి చరణ్‌ అర్జున్‌ అన్న అవకాశం ఇచ్చిండు. అన్ననే నా గురువు. జీఎంసీ మ్యూజిక్‌ ద్వారా ‘గట్లపొంటి గట్లనడుమా పోయెటీ మేనత్త కొడుకా’ పాడిన. ఇది కూడా హిట్‌ అయ్యింది. బాల చంద్రిక, నేషనల్‌ అంబేద్కర్‌ ఫెలోషిప్‌ అవార్డులు ఢిల్లీలో అందుకున్నా. పరీక్షలు, పాటలతో బిజీగా ఉంటూనే, జానపద జాతరకు జైకొడుతున్నా.

స్పెషల్‌గా చూస్తుండ్రు

ఇప్పటి వరకు పది పాటలు పాడిన. నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట‘కోలుకోలు సాంగ్‌’. బాగా ఆదరణ పొందిన పాట ‘కట్టా కిందా కందిసేనూ.. కందీ సేన్ల మర్రిమాను’. స్క్రీన్‌పై కనిపించాలనే ఆలోచనతో ఐదు పాటల్లో నటించిన. కాలేజీ ఫ్రెండ్స్‌ అయితే నాతో సెల్ఫీలు కూడా తీసుకుంటుండ్రు. బాగా థ్రిల్లింగ్‌ అనిపిస్తుంది కూడా. కాలేజీలోకి ఎంటరవగానే నన్ను స్పెషల్‌గా చూస్తరు. లెక్చరర్స్‌ బాగా ఎంకరేజ్‌ చేస్తరు. ఎంత చదువుకున్నా పాటే నా ప్రొఫెషన్‌. పాటతో పాటు సంగీతం రావాలనే ఆలోచనతో జై శ్రీనివాస్‌ సార్‌ దగ్గర మ్యూజిక్‌ నేర్చుకుంటున్నా. ఇంకా ఇంకా మంచి పాటలు సేకరించి పాడాలని అనుకుంటున్నా.

చులకనగా చూసేటోళ్లు

స్కూల్లో ఏ కాంపిటీషన్‌ జరిగినా పాల్గొనేదాన్ని. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు నేను స్కూల్‌లో చదువుతున్నా. స్టేజీ భయం అప్పటికే పోయింది. ఎక్కడ ధూమ్‌ధామ్‌ అయితే అక్కడ, నా గొంతు వినిపించేది. ‘ఇంత చిన్న పిల్ల తెలంగాణ కోసం కాలికి గజ్జెకట్టి ఆడుతుంది. చిచ్చర పిడుగులెక్క మాట్లాడుతుంది’ అనేటోళ్లు నా ప్రదర్శన చూసి. నాకు గర్వంగా అనిపించేది. ఎందుకంటే నేను పాట పాడుతానంటే మా ఇంట్లోవాళ్లు అర్థం చేసుకున్నరుగానీ బైటివాళ్లు అర్థం చేసుకోలేదు. పైగా నిరుత్సాహ పరిచే ప్రయత్నాలు చేశారు. మేం పేదోళ్లమని చిన్నచూపు ఉండేది. అంతెందుకు, కనీసం ‘తిన్నరా.. పన్నరా’ అని అడిగేటోళ్లు కాదు. చుట్టాలోళ్లు అయితే, పలకరిస్తే ఎక్కడ సాయం చేయాల్సి వస్తదేమో అని అంటీముట్టనట్టు ఉండేటోళ్లు. వాళ్లందరికీ నా పాటల ద్వారా సమాధానం చెప్పేదాన్ని.

… దాయి శ్రీశైలం

ఇవి కూడా చ‌ద‌వండి:

తన్వి.. చిన్నారి కవయిత్రి!

వీధి కుక్కలకు.. పెద్ద దిక్కు!

వ్యాక్సిన్‌ డైట్‌

ఓట్స్‌ ఫ్రూట్‌ సలాడ్‌

ఆర్మూర్‌.. షాన్‌దార్‌!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాజాపేటలో.. రాగాల కోట!
రాజాపేటలో.. రాగాల కోట!
రాజాపేటలో.. రాగాల కోట!

ట్రెండింగ్‌

Advertisement