Earthquake | మయన్మార్‌ను వరుస భూకంపాలు (Earthquakes) వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి అక్కడ భూమి కంపించింది. శుక్రవారం ఉదయం 5:53 గంటల ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ప్రకంపనలతో పలు భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
కాగా, గత కొన్ని రోజులుగా మయన్మార్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. గత నెల 30న కూడా 4.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక అక్టోబర్ 3, 5, 6 తేదీల్లోనూ 3.3, 3.7, 3.6 తీవ్రతతో భూమి కంపించింది. తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు.
ఈ ఏడాది మార్చిలో మయన్మార్‌ను అత్యంత శక్తిమంతమైన భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. మార్చి 28న మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు రోడ్లు, వంతెనలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) ప్రకారం.. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 200,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక మధ్య మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రతిరోజూ కుదుపులకు గురవుతున్నాయి. ఇక భారత్-మయన్మార్ సరిహద్దుల్లో (India-Myanmar border)నూ వరుస భూకంపాలు (Earthquakes) సంభవించాయి. జూన్ 10వ తేదీన 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8 నుంచి 4.5 మధ్య నమోదైంది. ఈ ప్రకంపనల ధాటికి ఈశాన్య రాష్ట్రాలు కూడా వణికిపోయాయి.
Also Read..
Earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. వీడియో
Strikes in Afghanistan | ఆఫ్ఘాన్ మంత్రి భారత్ పర్యటన వేళ.. కాబూల్‌పై పాక్ వైమానిక దాడులు