Heart Attack | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని దుర్మరణం చెందింది. పొద్దుట్నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో ట్రీట్మెంట్ తీసుకున్న బాలిక.. ఫ్రెష్ అయిదామని ఇంటికి వెళ్లిన కాసేపటికే హార్ట్ ఎటాక్‌తో మరణించడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని వీరులపాడు గ్రామానికి చెందిన శీలం జాహ్నవి కంచికచర్ల పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతోంది. కుటుంబసభ్యులతో కలిసి కంచికచర్లలోనే నివాసం ఉంటోంది. కొంతకాలంగా జాహ్నవి గ్యా్స్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నది. దీంతో నిన్న కంచికచర్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఇల్లు దగ్గరలోనే ఉండటంతో ఫ్రెష్ అయి వస్తామని తల్లిదండ్రులతో కలిసి జాహ్నవి ఇంటికి వెళ్లింది.
బాత్రూంలో ఫ్రెష్ అవుతుండగా జాహ్నవికి ఛాతిలో నొప్పి వచ్చి కుప్పకూలింది. దీంతో హుటాహుటిన మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీపీఆర్ అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. కాగా గుండెపోటుతో జాహ్నవి మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.